చిరు అక్కకు ఇంగ్లిష్ నేర్పింది ఆ ఇద్దరేనట!

Mon Dec 10 2018 23:00:01 GMT+0530 (IST)

సినిమాల్లో నటిగా కెరీర్ షురూ చేసి రాజకీయాల్లోకి వచ్చినవారెందో. అయితే.. అందులో సక్సెస్ ఫుల్ అయ్యేది కొద్ది మందే. సక్సెస్.. ఫెయ్యిలూర్స్ కు సంబంధం లేకుండా తమదైన ఇమేజ్ ను సొంతం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు. కుష్బూ లాంటి కొద్ది మందికే సాధ్యమని చెప్పాలి. ఒక పార్టీకి చెందిన ఛానల్ లో పని చేస్తూ వైరి పార్టీని అభిమానించటం.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పటానికి ఎన్ని గట్స్ కావాలి?  కానీ.. అలాంటివి కుష్బూలో కోరినంత కనిపిస్తుంది.అన్నాడీఎంకేకు చెందిన ఛానల్ లో పని చేసే టైంలో డీఎంకే మీద అభిమానాన్ని పెంచుకున్న ఆమె.. ఆ విషయాన్ని దాచుకోవటానికి అస్సలు ప్రయత్నించలేదు. అదే సమయంలో డీఎంకే నుంచి కాంగ్రెస్ కు షిఫ్ట్ కావటానికి వెనుకాడలేదు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కుష్బూ.. తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె బోలెడన్ని ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. దాదాపు 32 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఆమె చెప్పని ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. తొమ్మిది తరగతి మధ్యలో చదువు ఆపేసిన ఆమె.. చక్కటి ఇంగ్లిషులో మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు కారణంగా చెప్పారు.  తాను ఇంగ్లిషు చక్కగా మాట్లాడటానికి కారణం తన మొదటి హీరో వెంకటేశ్ అని.. రెండో హీరో నాగార్జునగా చెప్పారు.

"వారిద్దరూ అప్పుడే అమెరికా నుంచి వచ్చారు. నాకేమో ఇంగ్లిషులో అంత బాగా వచ్చేది కాదు. వారితో సినిమాలు చేసినప్పుడు ఇంగ్లిషులోనే మాట్లాడాలని చెప్పేవారు. ఎలా మాట్లాడాలో నేర్పించారు. నాగార్జున అయితే ఒక ఇంగ్లిషు పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అదే నాకొచ్చిన మొదటి పుస్తకం.. గిఫ్ట్ రూపంలో. ఇంగ్లిషు నవలలు చదివితే  భాష మరింత బాగా వస్తుందని చెప్పారు. అలా వాళ్లిద్దరితో ఇంగ్లిషు నేర్చుకున్నా. అందుకు వారిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి" అని వెల్లడించారు. అప్పుడెప్పుడో జరిగిన విషయాల్ని గుర్తు పెట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్పటం కుష్బూ లాంటోళ్లకే సాధ్యం.