Begin typing your search above and press return to search.

పొద్దు పొద్దున్నే రివ్యూలపై ఫైర్..

By:  Tupaki Desk   |   2 Sep 2015 5:33 AM GMT
పొద్దు పొద్దున్నే రివ్యూలపై ఫైర్..
X
ఛానళ్లలో రివ్యూల మీద మండిపడింది సీనియర్ నటి ఖుష్ బూ. జీవన్, విద్య జంటగా అధిబర్ మూవీపై ఓ ఛానల్ ప్రసారం చేసిన కార్యక్రమాన్ని చూసి ఖుష్ బూకి మండిపోయింది. ఇలాంటి చెత్త చూడాలని ఇంకా అనుకుంటే మీ తలరాత ఎవరూ మార్చలేరు అన్నట్లుగా ఉందిట ఆ రివ్యూ. దీంతో ఛానళ్లపై బాగా కోపం వచ్చింది ఖుష్ బూకి. కొత్త సినిమా క్లిప్పింగ్స్ తోటి రేటింగ్ పెంచుకునే ఛానళ్లు.. వాటిపై ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయడమేంటని ప్రశ్నిస్తోంది.

అసలు మూవీ సీన్స్ ప్రసారం చేయకుండా ఛానల్స్ బతగ్గలవా అన్న ఖుష్ బూ... ఒక సినిమా సీన్ కూడా ఛానల్స్ ను ప్రసారం చేయండి చూద్దామంటూ సవాల్ కూడా విసిరింది. నిర్మాతలు తమ కష్టాన్ని, రక్తాన్ని సినిమా కోసం వెచ్చిస్తారని.. ఇలాంటి రివ్యూలు ప్రజల్లో ఆ చిత్రంపై దురభిప్రాయం కలిగిస్తాయని ఆవేదన చెందింది ఖుష్ బూ. అందరూ మంచి సినిమాలే తీయాలని అనుకుంటారని చెప్పిందీ సీనియర్ నటి. ఇతర ఛానళ్లు.. ఈ ఛానల్ పై చెడు వార్తలు ప్రసారం చేస్తే... అప్పుడు బాధేంటో తెలిసొస్తుందంటూ... హితవు పలికింది కూడా.

ఇంతకీ... జనాలు కూడా తమ చెమట, రక్తంతో కష్టపడ్డ సొమ్ములతోనే కదా... సినిమా టికెట్స్ కొనుక్కునేది. ఒక ప్రొడ్యూసర్ కష్టంతో పోల్చితే.. ఇన్ని కోట్ల మంది కష్టానికి ఎక్కువ విలువ ఉంటుందేమో. ఆ విషయం ఖుష్ బూకి తట్టలేదనుకుంటా. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు రివ్యూలు రాస్తే అనాలి కానీ... అసలు రివ్యూలే తప్పంటే ఎలా ? రివ్యూలతో సంబంధం లేకుండా బంపర్ హిట్స్ కొట్టి, కలెక్షన్స్ కుమ్మేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. జనాలు మూవీ చూడాలని అనుకోవాలి కానీ... ఎలాంటి ప్రచారాన్ని పట్టించుకోరని... ఖుష్ బూ తెలుసుకుంటే నయం.