Begin typing your search above and press return to search.

అల్లువారికి బాలీవుడ్ డైరెక్టర్ చెక్

By:  Tupaki Desk   |   17 Aug 2018 11:37 AM GMT
అల్లువారికి బాలీవుడ్ డైరెక్టర్ చెక్
X
రామాయాణం ఆధారంగా ఇండియాలోని వేర్వేరు భాషల్లో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఐతే ఇప్పటి సాంకేతికతను ఉపయోగించుకుని భారీ స్థాయిలో రామాయణాన్ని సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో ‘రామాయణం’ తీయబోతున్నట్లు గత ఏడాది ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి అరవింద్ ఈ సినిమా చేయాలనుకున్నాడు. ఐతే ఆ ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ సమాచారం లేదు. ఆ దిశగా ఏదైనా వర్క్ జరుగుతోందా అన్నది కూడా తెలియదు. నిజంగా ‘రామాయణం’ మీద సినిమా తీసే ఉద్దేశం ఉంటే మాత్రం బాలీవుడ్ ఫిలిం మేకర్ కునాల్ కోహ్లి ప్రకటన వీళ్లకు ఇబ్బంది కలిగించేదే.

గతంలో అమీర్ ఖాన్ హీరోగా ‘ఫనా’ తీసిన కునాల్.. ఇప్పుడు రామాయణం ఆధారంగా ‘రామ్ యుగ్’ పేరుతో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర టైటిల్ లోగో పోస్టర్ కూడా కునాల్ లాంచ్ చేశాడు. రొమాంటిక్ సినిమాలకు పేరుబడ్డ కునాల్.. రామాయణం నేపథ్యంలో భారీ సినిమా తీయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. రామాయణం అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న.. ఆధునికత ఉన్న గ్రంథం మరొకటి లేదని.. ఇప్పటి కాలానికి అనుగుణంగా రామాయణాన్ని సరళంగా.. ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తానని కునాల్ అంటున్నాడు. ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఇంకా తారాగణం ఖరారవ్వలేదు. కునాల్ చివరగా ఓ తెలుగు సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. తమన్నా-సందీప్ కిషన్ కాంబినేషన్లో లండన్ నేపథ్యంలో ఆ సినిమాను తెరకెక్కించాడు కునాల్. కానీ ఆ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. దాని సంగతి తేల్చకుండానే ‘రామ్ యుగ్’ సినిమాను అనౌన్స్ చేశాడు కునాల్.