Begin typing your search above and press return to search.

కృష్ణాష్ట‌మి లెక్క తేల్చిన దిల్‌ రాజు

By:  Tupaki Desk   |   6 Feb 2016 9:30 AM GMT
కృష్ణాష్ట‌మి లెక్క తేల్చిన దిల్‌ రాజు
X
లెక్కంటే లెక్కే అంటాడు దిల్‌ రాజు. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుల‌తో గొడ‌వ‌ప‌డైనా స‌రే తాను అనుకొన్న‌దే చేస్తాడు. ట్రేడ్ పండితులు అక్క‌డే దిల్‌ రాజు విజయ ర‌హ‌స్యం దాగుంది అంటుంటారు. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటో తెలుసా? సినిమా ర‌న్ టైమ్‌. తన సంస్థ నుంచి వ‌చ్చే ఏ సినిమా అయినా స‌రే... ల్యాగింగ్‌ గా ఉండ‌కూడ‌ద‌నేది దిల్‌ రాజు సిద్ధాంతం. థియేట‌ర్‌ లో కూర్చున్న ప్రేక్ష‌కుడికి సినిమా ఏ ద‌శ‌లోనూ బోర్ అనిపించ‌కూడ‌ద‌ని, అలా అనిపించ‌కూడ‌దంటే సినిమా క్రిస్పీగా ఉండాల్సిందే అని దిల్‌ రాజు చెబుతుంటాడు. కానీ చాలామంది ద‌ర్శ‌కులు తాము తీసిందంతా ఉండాల్సిందే అని ప‌ట్టుబ‌డుతుంటారు. క‌ష్ట‌ప‌డి తీసిన సినిమా కావ‌డం, ఆ స‌న్నివేశాల్ని రాసుకొన్న ద‌ర్శ‌కుల‌కి వాటిపై ప్రేమ ఉండ‌టం మామూలే. అయినా స‌రే... దిల్‌ రాజు మాత్రం రాజీ ప‌డ‌డు.

ర‌న్ టైమ్ రెండుంపావు గంట‌ల‌కి మించిందంటే సినిమాకి నిర్దాక్షిణ్యంగా కోత‌లు పెట్టేస్తుంటాడు. తాజాగా మ‌రోసారి అదే జ‌రిగింది. కృష్ణాష్ట‌మి సినిమాని 2.14 నిమిషాల ర‌న్‌ టైమ్‌ గా తేల్చేశాడు. నిజానికి ఈ సినిమాకి కాస్త ఎక్కువ నిడివితోనే తెర‌కెక్కించార‌ట‌. కానీ దిల్‌ రాజు మాత్రం అవ‌స‌రం లేద‌ని బాగా త‌గ్గించిన‌ట్టు తెలిసింది. ఇదివ‌ర‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులాంటి సినిమాకి కూడా దాదాపుగా అర‌గంట స‌న్నివేశాల్ని కోతేశాడ‌ట దిల్‌ రాజు. శ్రీకాంత్ అడ్డాల వ‌ద్ద‌ని చెప్పినా స‌రే... దిల్‌ రాజు మాత్రం తాను అనుకొన్న‌దే చేశాడు. ఆ సినిమా మంచి ఫ‌లితాన్నే సొంతం చేసుకొంది. దిల్‌ రాజు ర‌న్ టైమ్ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇప్పుడు కృష్ణాష్ట‌మి విష‌యంలోనూ అదే చేశారు. సునీల్ క‌థానాయ‌కుడిగా వాసు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుద‌ల చేస్తున్నారు.