Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: కృష్ణగాడి వీర ప్రేమ గాథ

By:  Tupaki Desk   |   12 Feb 2016 7:43 AM GMT
మూవీ రివ్యూ: కృష్ణగాడి వీర ప్రేమ గాథ
X
చిత్రం: కృష్ణగాడి వీర ప్రేమ గాథ

నటీనటులు: నాని - మెహ్రీన్ - సంపత్ రాజ్ - శత్రు - బ్రహ్మాజీ - మురళీ శర్మ - పృథ్వీ - సత్యం రాజేష్ - హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: యువరాజ్
మాటలు: హను రాఘవపూడి - జై కృష్ణ
నిర్మాతలు: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హను రాఘవపూడి

‘అందాల రాక్షసి’ కమర్షియల్ గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఆ సినిమాతో టేస్టున్న దర్శకుడు అనిపించుకున్నాడు హను రాఘవపూడి. ఈసారి నాని లాంటి మంచి నటుడితో తొలి సినిమాకు భిన్నంగా ఓ ఎంటర్ టైనర్ చేశాడు హను. అదే.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. తొలి టీజర్ నుంచి ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కృష్ణ (నాని) మహా పిరికి వాడు. అతను ఫ్యాక్షన్ లీడర్ అయిన రామరాజు (శత్రు) చెల్లెలైన మహా లక్ష్మి (మెహ్రీన్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే రామరాజుకు భయపడి ఇద్దరూ తమ ప్రేమను దాచేసి బయటికి మాత్రం పోట్లాడుకుంటున్నట్లు నటిస్తారు. ఇంతలో మహాలక్ష్మికి పెళ్లి ఖాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇక కృష్ణ తన ప్రేమ గురించి రామరాజుకు చెప్పేద్దామనుకుంటున్న సమయంలో.. అతనే వచ్చి తనకో సాయం చేస్తే తన చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. ఇంతకీ అతనడిగిన సాయం ఏంటి? కృష్ణ అతడికా సాయం చేసి.. మహాలక్ష్మిని దక్కించుకున్నాడా లేదా అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

మామూలు పాత్రల్నే తన నటనా కౌశలంతో ప్రత్యేకంగా మార్చేసే నటుడు నాని. ఇక అతడికి టిపికల్ క్యారెక్టర్స్ పడ్డాయంటే ఎలా చెలరేగిపోతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు పాత్రను అలాగే అద్భుతంగా పండించి.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడిక అతడికి పిరికివాడి పాత్ర పడింది. ఈసారి కూడా అతను నిరాశ పరచలేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లోనూ హీరో పాత్రే ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రతో ముడి పడ్డ సన్నిశాల్లో వినోదానికి ఢోకా లేదు.

ఐతే ‘భలే భలే మగాడివోయ్’లో మొత్తం హీరో పాత్ర చుట్టూ తిప్పినట్లు కాకుండా.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో కొన్ని ఉపకథలు కూడా కలిశాయి. ఆ కథలకు లింకులు కలిపి ఒక చోటికి తెచ్చే క్రమంలో కొంత గందరగోళం సినిమాను కొంచెం కిందికి తీసుకెళ్లింది. దర్శకుడు హను రాఘవపూడి చాలా విషయాలు చెప్పే క్రమంలో కథనాన్ని అక్కడక్కడా పక్కదారి పట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఈ గందరగోళం ఎక్కువైంది.

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఇంతకుముందు చాలా సినిమాలు చూశాం. ఒకప్పుడు సీరియస్ గా సాగిన సినిమాలు.. ఆ తర్వాత కామెడీ బాట పట్టాయి. ఐతే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ గతంలో వచ్చిన ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలకు భిన్నమైంది. ఇందులో వినోదం ఉంది. కానీ ‘సీమశాస్త్రి’ తరహా తమాషా సినిమా కాదు. అలాగే ఫ్యాక్షన్ నేపథ్యంలో సీరియస్ సన్నివేశాలు కూడా వస్తాయి. అలాగని ఇది హీరో పౌరుషంతో ముడిపడ్డ సినిమా కూడా కాదు. హను రాఘవపూడి సీరియస్ కథలోనే పిరికివాడైన హీరో పాత్ర ద్వారా వినోదం పండించాడు.

ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల దాగుడు మూతల ప్రేమకథ సరదాగా సాగిపోతుంది. హీరో పాత్ర పరిచయం దగ్గర్నుంచి ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంటుంది. మామూలు సన్నివేశాల్ని కూడా నాని తనదైన శైలిలో పండిస్తుంటే కథనం రయ్యిన దూసుకెళ్తుంది. లవ్ స్టోరీతో పాటు సమాంతరంగా ఫ్యాక్షన్, మాఫియా పాత్రలకు సంబంధించిన సన్నివేశాల్ని సమాంతరంగా నడుపుతూ వెళ్లాడు దర్శకుడు. ఇంటర్వెల్ దగ్గర కథనం చక్కటి మలుపు తీసుకుంటుంది. ద్వితీయార్ధం మీద ఆసక్తి పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ సెట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు బ్రహ్మాజీ పాత్రతో ముడిపడ్డ పోలీస్ స్టేషన్ సీన్ ప్రథమార్ధానికి హైలైట్. కడుపు చెక్కలయ్యేలా చేస్తుందా సన్నివేశం.

ఇప్పటిదాకా కష్టంగా సాగింది.. ఇకపై ఉంది అసలు కథ అని నాని పాత్రతో చెప్పించి ప్రథమార్ధానికి చక్కటి ముగింపునిచ్చారు. ఐతే నిజానికి ప్రథమార్ధమే చాలా ఇష్టంగా సాగిపోతుంది. ద్వితీయార్ధమే కష్టంగా నడిపించాడు దర్శకుడు. పృథ్వీ పాత్ర అక్కడక్కడా కామెడీ డోస్ ఇస్తున్నప్పటికీ.. నాని పాత్రలో ఫన్ తగ్గిపోవడం.. హీరో పాత్ర పక్కకు వెళ్లిపోయి వేరే పాత్రల మీదికి దృష్టి వెళ్లిపోవడం.. కొన్ని అనసవర సన్నివేశాలు కథనాన్ని కొంచెం పక్కదారి పట్టిస్తాయి. పాత్రలు మరీ ఎక్కువైపోవడంతో.. స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళంగా ఉండటంతో ప్రేక్షకులు డీవియేట్ అయిపోతారు.

బోర్ కొట్టించే సన్నివేశాలేమీ లేవు కానీ.. ద్వితీయార్ధంలో ఆశించినంత వినోదం లేకపోవడం మైనస్. ప్రిక్లైమాక్స్ - క్లైమాక్స్ కొంచెం సాగతీతలా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో బ్రహ్మాజీ హైలైట్ అయినట్లే ద్వితీయార్ధంలో జమదగ్నిగా పృథ్వీ చెలరేగిపోయాడు. నాని సినిమా అంతటా తనదైన శైలిలో వినోదం పండించాడు. గతంలో వచ్చిన నాని సినిమాలన్నింటికంటే భిన్నంగా ఇందులో చాలా పాత్రలు, భారీతనం కనిపిస్తాయి. ఒక స్టార్ హీరో సినిమాకున్నంత భారీతనం ఉంది ఇందులో.

నటీనటులు:

నాని నటనలో లోపాలు వెతికే అవకాశం అతనెక్కడ ఇస్తాడు. కృష్ణ పాత్రలోనూ తన ప్రత్యేకత చూపించాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు నాని. ప్రథమార్ధాన్నంతా తనే నడిపించాడు. పిరికివాడిగా కామెడీ ఎంత బాగా పండించాడో.. క్లైమాక్స్ లో తన మహాలక్ష్మి ఇక లేదు అన్నపుడు ఎమోషన్లు కూడా అంతే బాగా పలికించాడు. ద్వితీయార్ధంలో దర్శకుడు నానిని సరిగా వాడుకోలేదు కానీ.. నాని తాను కనిపించినంత సేపూ స్క్రీన్ ను ఆక్రమించేశాడు. కొత్తమ్మాయి మెహ్రీన్ బాగుంది. నటనతోనూ ఆకట్టుకుంది. హావభావాలు బాగానే పలికించింది మెహ్రీన్. ఐతే ఆమె బొద్దుతనం మున్ముందు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి. సంపత్ రాజ్ మంచి పాత్ర చేశాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ - పృథ్వీ బాగా నవ్వించారు. రాజేష్ కూడా ఉన్నంతసేపూ ఆకట్టుకున్నాడు. మురళీ శర్మది మామూలు పాత్రే. హరీష్ ఉత్తమన్ కొత్తగా కనిపించాడు. మిగతా పాత్రధారులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘అందాల రాక్షసి’లో తన టేస్టు చూపించిన హను రాఘవపూడి మరోసారి.. టెక్నీషియన్స్ నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నువ్వంటే నా ప్రాణం పాట వెంటాడుతుంది. ఈ ట్యూన్ బ్యాగ్రౌండ్ స్కోర్ లోనూ బాగా వాడుకున్నాడు. మిగతా పాటలు - నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరాయి. యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాలోని మరో హైలైట్. సినిమా అంతటా ఒక వైబ్రంట్ లుక్ ఉండేలా కెమెరా పనితనం చూపించాడు యువరాజ్. హను - జైకృష్ణ కలిసి రాసిన మాటలు బాగున్నాయి. హీరోయిన్ ‘‘నీకెందుకింత భయం’’ అని అడిగితే.. ‘‘నిన్ను ప్రేమించాకే ప్రాణం మీద ఆశ పెరిగింది. ఆ ఆశ నుంచే భయం పుట్టింది’’ అని హీరో అనడం బాగుంది. డైలాగ్స్ ఎక్కడా కృత్రిమంగా లేకుండా సహజంగా ఉండి ఆకట్టుకున్నాయి. ఇది చిన్న సినిమా అయినప్పటికీ 14 రీల్స్ వాళ్ల స్థాయికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తొలి సినిమాకు పూర్తి భిన్నమైన కథను ఎంచుకుని.. కొత్తదనంతో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ అందించాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇలాంటి సినిమా తీసి మెప్పించడం అంత సులువేమీ కాదు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉండేలా అతను చాలా కష్టపడ్డ విషయం తెలుస్తుంది కానీ.. ఎక్కువ విషయాల్ని ముడిపెట్టే క్రమంలో కొంత గందరగోళం తప్పలేదు. మొత్తానికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ డైరెక్టర్స్ ఫిలిం అనడంలో సందేహం లేదు.

చివరగా: కృష్ణా.. బాగుందయ్యా నీ వీర ప్రేమగాథ

రేటింగ్: 3/5