Begin typing your search above and press return to search.

నాని లెక్క.. 25 కోట్లా?

By:  Tupaki Desk   |   11 Feb 2016 9:30 AM GMT
నాని లెక్క.. 25 కోట్లా?
X
ఒక్క సినిమా నాని రేంజే మార్చేసింది. ‘భలే భలే మగాడివోయ్’ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంతో నాని తర్వాతి సినిమాకు నిర్మాతలు కాసుల పంట పండించుకుంటున్నారు. 1 నేనొక్కడినే, ఆగడు లాంటి డిజాస్టర్లతో కుదేలైపోయిన 14 రీల్స్ అధినేతలు.. నానితో చిన్న సినిమాగా మొదలుపెట్టిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఇప్పుడు పెద్ద సినిమా రేంజికి చేరిపోయింది. కేవలం పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. నిర్మాతలకు రూ.25 కోట్ల దాకా తెచ్చిపెడుతున్నట్లు అంచనా. సినిమా ఇంకా పూర్తి కాకముందే టీజర్లు - ట్రైలర్లతో అదరగొట్టడంతో రూ.15 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసేసుకున్నాడు అభిషేక్.

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడైపోయాయి. జెమిని టీవీ రూ.4 కోట్లకు హక్కులు తీసేసుకుంది. ఒక్క ఓవర్సీస్ రైట్స్ మాత్రం నిర్మాతలు తమ దగ్గరే పెట్టుకున్నారు. యుఎస్ లో ఈ సినిమాను 130 స్క్రీన్లలో రిలీజ్ చేయబోతుండటం విశేషం. అక్కడ సినిమాకు ఓ మోస్తరు టాక్ వచ్చినా మిలియన్ క్లబ్బును అందుకోవడం ఖాయం. అంటే ఐదారు కోట్ల దాకా ఆదాయం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. మొత్తం అన్ని లెక్కలూ కలిపితే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ రూ.25 కోట్ల దాకా నిర్మాతలకు ఆదాయం తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. 1 నేనొక్కడినే -ఆగడు సినిమాలతో పోగొట్టుకున్న మొత్తంలో కొంత వరకు నాని సినిమా రికవర్ చేసి పెడుతున్నట్లే.