బాలయ్యను ఏ రేంజ్ లో అభినందించాడంటే...

Thu Jan 12 2017 11:19:58 GMT+0530 (IST)

బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా విడుదలయి ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇండస్ట్రీలో చాలామంది ఇప్పటికే బాలయ్య - క్రిష్ - శాతకర్ణి టీం కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ "శాతకర్ణి"పై స్పందించాడు. సాదారణంగా హీరోలను పొగడటానికి ఏమాత్రం ముందుకురాని ఆయన తాజాగా బాలయ్యపై ప్రశంసల వర్షమే కురిపించాడు.

బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాలయ్యకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఫేస్ బుక్ లో ఒక పొడవైన మెసేజ్ పెట్టిన కృష్ణవంశీ... బాలయ్యను ఆకాశానికెత్తేశాడు. ఈ సందర్భంలో... నందమూరి బాలకృష్ణ స్క్రీన్ పైనా - స్క్రీన్ బయటా కూడా ఒక అగ్నిపర్వతం లాంటి వాడంటూ ప్రశంసించాడు. ఎలాంటి పాత్రనైనా - ఎలాంటి సినిమా అయినా చేయగల ఏకైక నటుడు బాలయ్యే అన్న కృష్ణవంశీ... ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సుదీర్ఘ కాలంగా వెండితెరను వర్ణరంజితం చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు.

ఈ సందర్భంలో క్రిష్ ప్రస్థావన తీసుకొచ్చిన కృష్ణవంశీ... క్రిష్ దర్శకత్వ ప్రమాణాలకు - అతడి విలువలకు అభినందనలు తెలిపాడు. 2000 ఏళ్ల కిందటి నేపథ్యంతో "గౌతమీపుత్ర శాతకర్ణి" గా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అలరించడానికి వస్తున్న ఈ బాలయ్య సినిమా పెద్ద హిట్టయి ఇండస్ట్రీకి ఇన్సిపిరేషన్ గా నిలవాలని ఆకాంక్షించాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. అయితే... "బాహుబలి" లాంటి సినిమాల విషయంలో సైతం స్పందించని కృష్ణవంశీ తాజాగా "గౌతమీపుత్ర శాతకర్ణి" విషయంలో ఈ రేంజ్ లో స్పందించడం విశేషమే అనుకోవాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/