Begin typing your search above and press return to search.

సోగ్గాడా.. ఇక తగ్గవయ్యా

By:  Tupaki Desk   |   13 Feb 2016 9:30 AM GMT
సోగ్గాడా.. ఇక తగ్గవయ్యా
X
సరిగ్గా 29 రోజుల కిందట మొదలైంది కింగ్ నాగార్జున వసూళ్ల ప్రభంజనం. చిన్న ప్రవాహంలా మొదలై.. ఆ తర్వాత వరదతో బాక్సాఫీస్‌ ను ముంచెత్తేసింది. పోటీలో ఇంకో మూడు సినిమాలున్నా.. అందులో రెండు బడా సినిమాలున్నా.. రెండు వారాల తర్వాతి నుంచి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నా.. సోగ్గాడి హవా మాత్రం తగ్గలేదు. నాగార్జున సైతం ఆశ్చర్యపోయేలా అనూహ్యమైన కలెక్షన్లతో దూసుకెళ్లింది ‘సోగ్గాడే చిన్నినాయనా’. తొలి వీకెండ్ అవ్వగానే సినిమాలు కళ్లు తేలేసే ఈ రోజుల్లో మూడు, నాలుగు వారాల్లో కూడా హౌస్ ఫుల్ బోర్డులు వేయించుకుని ఆశ్చర్యపరిచింది నాగ్ మూవీ. మూడు, నాలుగు వారాల్లో సరైన సినిమాలు పడకపోవడం కూడా సోగ్గాడికి కలిసొచ్చింది.

ఐతే ఎట్టకేలకు ఐదో వారంలోకి అడుగుపెట్టాక సోగ్గాడి హవాకు తెరపడినట్లే ఉంది. నిన్న రిలీజైన నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రానికి మాంచి కలెక్షన్లు వస్తున్నాయి. తొలి రోజు సాయంత్రానికి టాక్ మరింత పాజిటివ్ అయింది. సినిమా సూపర్ హిట్ అని తీర్మానించేశారు ట్రేడ్ పండిట్స్. అన్నిచోట్లా థియేటర్లు నిండుగా కనిపిస్తున్నాయి. రెండో రోజు కూడా నాని హవా కొనసాగుతోంది. దీంతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ డ్రీమ్ రన్ కు దెబ్బ పడింది. మిగతా సంక్రాంతి సినిమాల కథ ఇప్పటికే ముగియగా.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు పోటీగా విడుదలైన ‘గరం’కు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో నాని సినిమాకు ఈ వారం, వచ్చే వారం కూడా తిరుగులేనట్లే. ఈ సినిమాకు ఫుల్ రన్లో రూ.25-30 కోట్ల మధ్య షేర్ వస్తుందని అంచనా.