అందుకే క్రిష్ ఆ మాట అన్నాడు..

Thu Jan 12 2017 15:53:17 GMT+0530 (IST)

మామూలుగా డైరెక్టర్ క్రిష్ వేదికలెక్కినపుడు అంతగా ఎమోషనల్ అవడు. అది ఎంత పెద్ద వేదిక అయినా సరే.. మామూలుగానే మాట్లాడతాడు. తన తొలి సినిమా అద్భుత విజయం సాధించినపుడు కూడా మీడియాతో మాట్లాడుతూ మామూలుగానే కనిపించాడు క్రిష్. అలాంటిది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో అతను అంతగా ఎమోషనల్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జై బాలయ్య నినాదాలు చేయడం.. బాలయ్య తప్ప ఇంకెవరూ శాతకర్ణి పాత్ర చేయలేరని.. ఆయన రాజసం ఇంకెవరికీ రాదని కితాబివ్వడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది. క్రిష్ కొంచెం అతి చేశాడేమో అన్న భావన కలిగింది. కానీ క్రిష్ ఆ రోజు ఎందుకంత ఎమోషనల్ అయ్యాడో ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా చూసిన జనాలకు స్పష్టంగా అర్థమవుతోంది.

మరో మాట లేదు. శాతకర్ణి పాత్ర చేయడానికి నూటికి రెండొందల శాతం బాలయ్య ఒక్కడే తగినవాడు. ఆయన కాకుండా మరో ప్రత్యమ్నాయం అన్నది ఊహకైనా అందని విషయం. క్రిష్ లాంటి క్లాస్ డైరెక్టర్ బాలయ్య లాంటి మాస్ హీరోతో సినిమా చేయాలనుకోవడమే అప్పట్లో చాలామందికి మింగుడుపడలేదు. ఐతే క్రిష్ బాలయ్యనే ఎందుకు ఎంచుకున్నాడో.. ఆయనపై ఎందుకంత భరోసా ఉంచాడు అన్నది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూస్తే సులభంగా అర్థమైపోతుంది. ఒక నటుడు ఒక పాత్రను ప్రేమించి.. దాన్ని అన్వయించుకుని.. ఆ పాత్రలోకి లీనమైతే ఎలా ఉంటుందనడానికి బాలయ్య పోషించిన శాతకర్ణి పాత్ర ఉదాహరణ. బాలయ్య ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో గొప్పగా నటించాడు. కానీ వాటన్నింటినీ మించి శాతకర్ణి పైన ఉంటుదని చెప్పడానికి ఆలోచించాల్సిన పని లేదు. అంత అద్భుతంగా నటించాడు బాలయ్య. ఆ రౌద్రం.. ఆ వాచకం.. ఆ నటన.. ఆ హావభావాలు.. వేటికవే గొప్పగా ఉన్నాయి. కేవలం బాలయ్య నోట డైలాగులు వినడానికే ‘శాతకర్ణి’ చూడాలి అనిపించేంత మనసు పెట్టి డైలాగ్స్ అద్భుతంగా పలికాడు బాలయ్య. ఇక పెర్ఫామెన్స్ పరంగా కూడా బాలయ్య తనకు తానే సాటి అనిపించాడు. కొన్ని సినిమాల్లో బాలయ్య పాత్రకు మించి నటించేస్తుంటాడు. కానీ ‘శాతకర్ణి’లో మాత్రం ఆయన నటన కొలిచినట్లుగా సరిపోయింది. మొత్తంగా తన వందో సినిమాగా ఎంత గొప్ప సినిమా చేయాలో అంత గొప్ప సినిమానే చేశాడు.. ఎంత గొప్పగా నటించాలో అంతే గొప్పగా నటించాడు బాలయ్య. తన ముందుకు ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా.. వాటన్నింటినీ పక్కనబెట్టి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని.. ఈ పాత్ర కోసం పరితపించి.. పాత్రలో లీనమై తన కెరీర్లో ఈ చిత్రాన్ని నిజంగానే ఒక గొప్ప మైలురాయిలా మిగుల్చుకున్నాడు నందమూరి కథానాయకుడు. అందుకే సాహో.. బాలయ్య.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/