ఇది మొదటిసారేమో క్రిష్

Wed Dec 19 2018 07:00:01 GMT+0530 (IST)

దర్శకుడు క్రిష్ పరిస్థితి భలే సంకటంగా ఉంది. ఒక పక్క జనవరి 9న విడుదల కానున్న ఎన్టీఆర్ కథానాయకుడు పనుల్లో బిజీగా ఉండగా మరోవైపు అదే నెల 25న రిలీజవుతున్న మణికర్ణిక తన ప్రమేయం లేకుండానే పోస్ట్ ప్రొడక్షన్ చేసేసుకుంటోంది. కాకపోతే ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ లో దర్శకత్వం కింద తన పేరు కింద కంగనా తనది కూడా వేసుకోవడంతో ఏమి అనలేని చేయలేని పరిస్థితి. నిజానికి ఇలా దర్శకత్వ బాధ్యతను ఒక మగ ఆడ కలిసి షేర్ చేసుకుని పేరు వేసుకున్న సందర్భం చాలా అరుదు అని చెప్పాలి.గత ఏడాది తమిళ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదా ఇదే బాపతులోకి వస్తుంది కానీ ఆ ఇద్దరూ భార్య భర్తలు. సాధారణంగా సినిమాకు దర్శకుడు ఒక్కరే ఉంటారు. విజయనిర్మల లాంటి వాళ్ళు తమ దర్శకత్వ ప్రతిభతో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. పరుచూరి సోదరులు ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు దర్శకత్వం వహించారు. వాళ్ళు అన్నదమ్ములు. అయితే ఇలా క్రిష్ కంగనా తరహాలో ఒకరితో ఒకరు సంబంధం లేని వాళ్ళు జాయింట్ గా డైరెక్ట్ చేయడం అనేది మాత్రం అరుదుగా కనిపిస్తోంది. క్రిష్ ఇప్పటిదాకా తాను అందులో నుంచి వైదొలగడానికి కారణాలు బయటికి చెప్పలేదు.

కంగనా సైతం ఎప్పుడు అడిగినా తప్పించుకు సమాధానాలు ఇస్తోంది కానీ అసలు ఎందుకు తాను పగ్గాలు తీసుకుందో చెప్పడం లేదు. అది వద్దు అనుకున్నాకే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కు ఓకే చెప్పాడు కానీ ఎన్టీఆర్ వచ్చినందుకు మణికర్ణికను వదిలేయలేదు. ఏదైతేనేం రెండు నెలల్లో క్రిష్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను పలకరించబోతున్నాయి. కథానాయకుడు-మణికర్ణిక జనవరిలో రానుండగా మహానాయకుడు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది.