Begin typing your search above and press return to search.

`మా` ప్ర‌మాణంలో ఆ ఇద్ద‌రి ఈగోలు!

By:  Tupaki Desk   |   22 March 2019 12:21 PM GMT
`మా` ప్ర‌మాణంలో ఆ ఇద్ద‌రి ఈగోలు!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా ముగిసిన అనంత‌ర ప‌రిణామాల‌పైనా ఆస‌క్తికర చ‌ర్చ సాగింది. మా పాత అధ్య‌క్షుడు శివాజీ రాజా, మా కొత్త అధ్య‌క్షుడు న‌రేష్ మ‌ధ్య పొర‌పొచ్చాల‌పై 800 మంది ఆర్టిస్టుల‌తో పాటు ఇండ‌స్ట్రీ యావ‌త్తు ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకుంది. ఆ ఇద్ద‌రి ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌లు.. వ్య‌వ‌స్థాగ‌త వైష‌మ్యాల్ని మీడియా ముందుకు తెచ్చి మా ప‌రువు మ‌ర్యాద‌లు మంట క‌లిపార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌పోతే నేడు మూవీ ఆర్టిస్టుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ స్వీకారాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో మా అధ్య‌క్షుడిగా న‌రేష్ ప్ర‌మాణం చేశారు.

ఈ వేడుక‌లో కొత్త అధ్య‌క్షుడి పేరైనా ఎత్త‌కుండా గ‌త అధ్య‌క్షుడు శివాజీ రాజా త‌న స్పీచ్ ని ఇవ్వ‌డంపై ఆర్టిస్టుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మూవీ ఆర్టిస్టుల సంఘం య‌థావిధిగా మంచి ప‌నులు చేయాల‌ని శివాజీ రాజా అన్నారు. గ‌తంలో తాను ఎన్నికైన‌ప్పుడు అసోసియేష‌న్ నిధిని ముట్టుకోకుండా కొత్త‌గా నిధిని సేక‌రించాల‌ని అంత‌కుముందు అధ్య‌క్షులు చెప్పార‌ని కొత్త అధ్య‌క్షుడికి సూచించారు. మంచి ప‌నుల‌కు తాను ఎల్ల‌పుడూ సాయం చేస్తాన‌ని అన్నారు. య‌థావిధిగా క‌ళాకారుల్లో పేద‌ల్ని ఆదుకోవాలి. అదే స‌మ‌యంలో సొంత భ‌వంతికి, అభివృద్ధికి నిధి సేక‌రించాల‌ని కోరారు శివాజీ రాజా.

ఇదే వేదిక‌పై ప్ర‌మాణ స్వీకారం చేసిన సీనియ‌ర్ న‌టుడు కోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. తెలుగులో ప‌ర‌భాషా న‌టుల్ని ప్రోత్స‌హించ‌డం స‌రికాద‌ని కోట మ‌రోసారి మా కొత్త టీమ్ కి సూచించారు. తెలుగులో తెలుగు న‌టులే క‌నిపించాల‌ని కోరారు. వాళ్ల‌కు ల‌క్ష‌ల్లో హోట‌ల్ బిల్స్, విమానం బిల్లులు క‌డుతూ మ‌న‌వాళ్ల‌కు చివ‌రిలో ఫించ‌ను ఇవ్వ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక షాయాజీ షిండే య‌ముడి గెట‌ప్ కి స‌రిపోతాడా? ఆయ‌న్ని దున్న‌పోతు ఎక్కిస్తే య‌ముడు అవుతాడా? అంటూ తీవ్రంగానే విమ‌ర్శించారు. షాయాజీ తో పాటు న‌న్ను న‌టించ‌మంటే న‌టించ‌లేన‌ని చెప్పాన‌ని, అమితాబ్ వంటి న‌టుల‌తో త‌న‌కు న‌టించేందుకు అభ్యంత‌రం లేద‌ని ... వారి వ‌ద్ద నౌక‌రీ అయినా చేస్తాన‌ని కోట త‌న మ‌న‌సును ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా శివాజీ రాజా, కోట ఈగో ఫీలింగ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.