Begin typing your search above and press return to search.

విద్యా వ్య‌వ‌స్థ‌పై కొర‌టాల ట్వీట్‌...

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:47 AM GMT
విద్యా వ్య‌వ‌స్థ‌పై కొర‌టాల ట్వీట్‌...
X
వేలు - ల‌క్ష‌ల మేర ఫీజులు క‌ట్టి కార్పొకేట్ క‌ళాశాల‌ల్లో త‌మ పిల్ల‌ల‌ను చేర్పిస్తే... ఒత్తిడి త‌ట్టుకోలేక ఆయా క‌ళాశాల‌ల హాస్ట‌ళ్ల‌లోనే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న పిల్ల‌ల‌ను చూసి త‌ల్లిదండ్రులు దిక్క‌తోచ‌ని అయోమ‌య స్థితిలో ప‌డిపోయారు. అస‌లు వారి వేద‌న వ‌ర్ణ‌నాతీతమే. మ‌రి విద్యార్థుల‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ఆయా క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌పై బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వాలు ఏమైనా చ‌ర్య‌లు తీసుకున్నాయా? అంటే... లేద‌న్న స‌మాధాన‌మే ఠ‌క్కున వినిపిస్తోంది. అయినా స‌ద‌రు విద్యా సంస్థ‌ల‌కు చెందిన య‌జ‌మానే ఓ రాష్ట్ర కేబినెట్‌ లో కీల‌క శాఖ మంత్రిగా - స‌ద‌రు విద్యా సంబంధిత వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌లు స‌ద‌రు మంత్రివ‌ర్యుడికి స్వ‌యానా వియ్యంకుడి చేతిలో ఉంటే... చ‌ర్య‌లు ఎందుకుంటాయి చెప్పండి. నిజ‌మే... విద్యా సంస్థ‌ల అధిప‌తి ఓ మంత్రి. విద్యా శాఖ మంత్రి ఆయ‌న వియ్యంకుడు. మ‌రి ఆ విద్యా సంస్థ‌పై చ‌ర్య‌లు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అంటే అతిశ‌యోక్తి కాదేమో.

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేంద్ర బిందువుగా మారిన నారాయ‌ణ కాలేజీల‌పై అస‌లు ద‌ర్యాప్తున‌కు కూడా ఆదేశాలు విడుద‌ల కాలేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో ఊహించుకోవ‌చ్చు. ఆ కాలేజీల యాజ‌మాన్యం ఏపీ కేబినెట్‌ లో కీల‌క మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌దేన‌న్న విష‌యం తెలిసిందే. ఇక విద్యా శాఖ మంత్రిగా నారాయ‌ణ‌కు స్వ‌యానా వియ్యంకుడైన గంటా శ్రీ‌నివాస‌రావు ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆ విద్యా సంస్థ‌ల‌పై ఈగ కూడా వాల‌డం లేదు. మ‌రోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో న‌మోద‌వుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల్లో మెజారిటీ శాతం నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు నెత్తీ నోరూ బాదుకున్నా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ త‌ర‌హా దుర‌వ‌స్థ స‌గ‌టు జీవిని క‌ల‌చివేస్తోంది. స‌గ‌టు జీవితో పాటు స‌మాజ ఉద్ధ‌ర‌ణ‌కు త‌మ‌వంతు కృషి చేస్తున్న సినీ ద‌ర్శ‌కులను కూడా ఈ దుర‌వ‌స్థ వేధిస్తోంద‌నే చెప్పాలి. అందుకేనేమో... టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌... ప్రస్తుత విద్యా వ్య‌వ‌స్థ‌పై త‌న‌దైన స్టైల్లో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

గ‌తంలోనూ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ - అవినీతిపై చాలా ఘాటు వ్యాఖ్య‌లు చేసిన కొర‌టాల‌... ఇప్పుడు విద్యా వ్య‌వ‌స్థ‌పై మాత్రం ఆస‌క్తిక‌రంగా - జ‌నాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసే విధంగా కామెంట్ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కొర‌టాల చేసిన కామెంట్ ఏంట‌నే విష‌యానికి వ‌స్తే... *మన విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హాయిగా ఆనందిస్తూ.. చదువుకునే రోజులని మళ్లీ తీసుకురావాలి* అంటూ కొరటాల ట్వీట్ చేశారు. చూసేందుకు ఇది చాలా చిన్న ట్వీట్‌ లా అనిపించినా, ఆయన చెప్పింది మాత్రం అక్షరసత్యమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్రస్తుత విద్యావ్యవస్థ ఎలా ఉందో తెలియంది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనేది పక్కన పెడితే.. నిజంగా కొరటాల శివ చెప్పినట్లుగా, చదువును ఆనందంగా ఇష్టపడి చదివే రోజులు వస్తే మాత్రం అంతకంటే ఇంకేం కావాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.