శ్రీరెడ్డి ఆరోపణలపై కొరటాల క్లారిటీ!

Tue Apr 17 2018 18:44:30 GMT+0530 (IST)

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది. వారిలో కొందరు ...శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించగా...మరి కొందరు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కొరటాల శివ ఓ వీడియోను విడుదల చేశారు. తనపై సోషల్ మీడియాలో ఏవో ఆరోపణలు వచ్చాయని అవన్నీ అవాస్తవాలని చెప్పారు. 'భరత్ అనే నేను' సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి ఇన్నాళ్లూ స్పందించలేక పోయానని చెప్పారు. తన జీవితంలో తన తల్లి భార్య తప్ప మరే స్త్రీ లేదని తెలిపారు.టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు కొరటాల శివల కాంబోలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ఇద్దరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదలయ్యేందుకు రెడీగా ఉంది. ఫైనల్ కాపీ రెడీ చేయడం కోసం గత 15 రోజుల నుంచి ప్రతి రోజూ 18 నుంచి 20 గంటలు పనిచేశామని కొరటాల శివ చెప్పారు. ఫైనల్ ఔట్ పుట్ చూశామని ఈ చిత్రం విజయంపై అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నామని అందుకే ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తున్నానని చెప్పారు. మొదట ఈ వ్యవహారంలో తన పేరు రావడంతో షాకయ్యానని బిజీగా ఉన్నా...మనసులో ఏదో మూల ఆ విషయం కలచి వేస్తోందని అన్నారు. ఆవిడ తన పేరు మెన్షన్ చేయలేదని కాబట్టి స్పందించాల్సిన అవసరం లేదని తన ఫ్రెండ్స్ చెప్పారని అన్నారు. తన పేరు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది కాబట్టి ఇపుడు స్పందిస్తున్నానని చెప్పారు.

తాను ఇప్పటివరకు 4 సినిమాలు తీశాననితానేంటో తన వ్యక్తిత్వమేంటో తనతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ తెలుసని కొరటాల శివ అన్నారు. తాను క్యాస్టింగ్ కౌచ్ కు పూర్తిగా వ్యతిరేకమని ఎవరిదగ్గరా.....ఆ అంశాన్ని ఎంకరేజ్ చేయనని చెప్పారు. తనతోపాటు తన టీం కూడా ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరితో ఒకేలా ఉంటామని తెలిపారు. తాను తన టీం ....చిన్న ఆర్టిస్టులను కూడా అండీ అని పిలుస్తామని పేరు పెట్టి పిలవలేదని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ తరహా పనులను తాము అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు.  సెట్లో కూడా తన నోటి నుంచి ఆ మాటలు రావని తన సినిమాల్లో కూడా మహిళలకు వ్యతిరేకంగా ఏదన్నా తప్పుగా అనిపించే సీన్ ఉందనిపిస్తే తొలగిస్తానని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు ఇలాంటివి రావడం సహజమని స్వామి వివేకానంద అమెరికా వెళ్లినపుడు ఆయన మీద కూడా వదంతులు వచ్చాయని అన్నారు.తన తల్లి భార్య తప్ప తన జీవితంలో మరో ఆడది లేదని మా ఫ్యామిలీ అంతా వివేకానంద అనుచరులమని చెప్పారు. మహిళలకు ఎంత విలువ ఇవ్వాలో తనకు తెలుసన్నారు. ఈ వ్యవహారంలో తన పేరు రావడంపై తన భార్య కూడా కలత చెందిందని అయితే ఆమె తనకు మద్దతుగా నిలిచిందని చెప్పారు. స్వతహాగా మన గురించి క్లారిటీ ఇస్తే సరిపోతుందని ఆమె ధైర్యం చెప్పడంతోనే ఈ రోజు ఈ వీడియో తీశానని చెప్పారు. మెరుగైన సమాజం కోసం తాను తన టీం తపన పడుతుంటామని చాలామంది యువకులు సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తుంటారని ఇటువంటి విషయాలు వారిని బాధపెడతాయని చెప్పారు. మహిళలను గౌరవించాలని న్యాయం కోసం పోరాటం చేయాలని వారి పోరాటానికి తాను పూర్తి సపోర్ట్ ఇస్తున్నానని చెప్పారు.