Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్లకు కొరటాల బూస్ట్

By:  Tupaki Desk   |   10 Feb 2016 5:30 PM GMT
సీనియర్ హీరోయిన్లకు కొరటాల బూస్ట్
X
ఏ ఇండస్ట్రీలో అయినా హీరోల కెరీర్ చాలా కాలమే ఉంటుంది. ఇక స్టార్ హీరోగా ఎదిగితే.. కెరీర్ కి అసలు బ్రేక్ అనేదే ఉండదు. 60ఏళ్లు దాటినా 20ల్లో ఉన్న భామలతో రొమాన్స్ చేసేయచ్చు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. పట్టుమని పదేళ్లపాటు హీరోయిన్ గా ఉంటే.. అది పెద్ద రికార్డ్. ఒకళ్లిద్దరు మినహాయించి మిగతావాళ్లంతా ముప్ఫై వచ్చేసరికే కనుమరుగయిపోతుంటారు. లేదా అక్క పాత్రలకో అమ్మ - అత్త రోల్స్ కో జంప్ అవాల్సి వస్తుంది.

కానీ అక్కడ కాంపిటీషన్ చాలా ఉండడంతో.. మెల్లగా తెరమరుగవుతూ ఉంటారు. ఇలా కనిపించకుండా పోయిన పాత హీరోయిన్లను వెతికి మరీ పట్టుకొచ్చి.. బూస్ట్ పట్టిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. మిర్చి మూవీలో నదియాను ప్రభాస్ కు అమ్మగా చూపించి.. మంచి రోల్ ఇచ్చాడు. ఆ తర్వాత నదియా సౌత్ లోనే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడులో సుకన్యను హీరో అమ్మగా మార్చాడు. ఇప్పుడు ఈమెకు కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీస్తున్న జనతా గ్యారేజ్ కోసం.. దేవయానిని తీసుకొస్తున్నాడు. ఈ మూవీలో దేవయాని రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తెలుగులో చివరిసారిగా మహేష్ మూవీ నానిలో కనిపించిన తర్వాత.. మళ్లీ ఇప్పుడే దేవయాని తెలుగు సినిమాలో నటిస్తోంది. మొత్తానికి పాత హీరోయిన్ల కెరీర్ ను మళ్లీ పక్కాగా బూస్టప్ ఇవ్వడంలో.. కొరటాల బాగా సక్సెస్ అవుతున్నాడు.