ఆ పుకార్లను ఖండించిన కొరటాల - కైరా!

Tue Jul 17 2018 19:53:55 GMT+0530 (IST)


విలక్షణ దర్శకుడు కొరటాల శివ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ల కాంబోలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇంత  బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాపై కొద్ది రోజులుగా ఓ దుష్ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివకు - హీరోయిన్ కైరా అద్వానీకి నిర్మాత దానయ్య ....పూర్తి రెమ్యున్ రేషన్ ఇవ్వలేదని పుకార్లు వస్తున్నాయి. అయితే ఆ పుకార్లను దానయ్య ఖండించారు. ‘డీవీవీ ఎంటర్ టైన్ మెంట్’ అధికారిక ట్విటర్ ఖాతాలో దానికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పుకార్లను కొరటాల శివ కూడా ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఆ సినిమా విడుదలకు ముందే తనకు రావాల్సిన పారితోషికం మొత్తం వచ్చిందని స్పష్టం చేశారు. టాలీవుడ్ లో రామానాయుడు గారి తర్వాత మంచి నిర్మాతగా పేరుగాంచిన వారిలో దానయ్య ఒకరని శివ కితాబిచ్చారు. తమకు రెమ్యున్ రేషన్ ఇవ్వకుండానే....ఆయన మరో మూడు పెద్ద ప్రాజెక్టులు ఎలా డీల్ చేస్తున్నారని శివ ప్రశ్నించారు.అంతకుముందు ఈ పుకార్లను హీరోయిన్ కైరా అద్వానీ కూడా ఖండించింది. ఆ పుకార్లను ఖండిస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. `డీవీవీ ఎంటర్ టైన్ మెంట్`లో నటించడం చాలా సంతోషాన్నిచ్చిందని అదే బ్యానర్ లో వరుసగా రెండో సినిమా కూడా చేస్తున్నానని ఆమె స్పష్టం చేసింది. అంతకుముందు సినిమాకు పారితోషికం ఇవ్వకుంటే....తర్వాతి సినిమాలో ఎలా పని చేస్తానని కూడా కైరా ప్రశ్నించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు పుకార్లు ఎవరు సృష్టిస్తారో తెలియదని....అవి వినగానే తాను షాకయ్యానని చెప్పింది. అంతకుముందు దానయ్య కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ప్రొడక్షన్ హౌజ్ మీద వచ్చిన పుకార్లు చాలా బాధించాయని దానయ్య అన్నారు. `భరత్ అనే నేను` చిత్రానికి సంబంధించి ఎవరికీ ఎలాంటి పేమెంట్లు ఎగ్గొట్టలేదన్నారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇటువంటి చెత్త కథనాలు ఇకపై ప్రచురించకుండా ఉండాలని జర్నలిస్టులకు దానయ్య  విజ్ఞప్తి చేశారు.