కొణిదెల నందమూరి ఫ్రెండ్ షిప్ స్టొరీ

Thu Mar 14 2019 13:32:28 GMT+0530 (IST)

అసలు సాధ్యం అవుతుందా అనే కాంబినేషన్ ను నిజం చేసి చూపించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రూపంలో ఇండియన్ సినిమాలోనే ఓ కొత్త మలుపు తెచ్చేలా ఉన్నాడు. షూటింగ్ ఇంకా తొలి దశలో ఉండగానే ఇంత విపరీతంగా చర్చను లేవనేత్తేలా చేయడం ఒక్క జక్కన్నకే సాధ్యమేమో. నందమూరి కొణిదెల కుటుంబాల హీరోలు బయట ఎంత సఖ్యతగా ఉన్నా తెరమీద ఆ ఫ్యామిలీల స్టార్ హీరోలు ఒకే సినిమా చేసిన దాఖలాలు లేవు. దాన్ని సాధ్యం చేసి చూపించారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు.ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో దీని ప్రస్తావన ప్రముఖంగా వచ్చింది. ముందు చరణ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకున్న చాలా బెస్ట్ ఫ్రెండ్ తారక్ అని సినిమాకు మించిన బంధం తమ మధ్య ఉందని చివర్లో మైక్ ఇవ్వబోతూ డార్లింగ్ అని సంభోదించడం విశేషం. స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఒప్పుకున్న యంగ్ టైగర్ కు థాంక్స్ చెప్పిన చరణ్ తమ స్నేహాన్ని మరోసారి చాటి చెప్పాడు

ఇక తర్వాత మైక్ అందుకున్న తారక్ ఇది తమ కెరీర్లనే ఉత్తమ చిత్రంగా మిగిలిపోతుందని దీని గురించి తెలియగానే చేయడానికి ఒప్పుకున్న చరణ్ ను మెచ్చుకుంటూ హాట్స్ అఫ్ అనే పదాన్ని జూనియర్ వాడటం ఆకట్టుకుంది. మాట్లాడింది కొంత సేపే అయినప్పటికీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తమ మధ్య ఎంత గొప్ప ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఉందో మీడియా సాక్షిగా చాటి చెప్పారు.

అంతే కాదు మా స్నేహానికి దిష్టి తగిలే అవకాశం ఉందని చిరకాలం తాము ఇలా మంచి స్నేహితులుగానే మిగిలిపోవాలని తారక్ చెప్పడం అభిమానులను టచ్ చేసిందని చెప్పొచ్చు. వీళ్ళ మాటలకు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఏవైనా పొరపొచ్చాలు ఉన్నా అవన్నీ తొలగిపోయేలా వీళ్ళు ప్రసంగించడం విశేషం.