Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా కొణిదెల వారమ్మాయి

By:  Tupaki Desk   |   30 Aug 2015 4:05 PM GMT
హీరోయిన్ గా కొణిదెల వారమ్మాయి
X
సినిమా ఫ్యామిలీల నుంచి అబ్బాయిల్ని హీరోల్ని చేయడానికి చూపే ఉత్సాహం.. అమ్మాయిల విషయంలో ఉండదు. పెద్ద ఫ్యామిలీస్ కి చాలామంది అమ్మాయిలు సినిమాల్లో రావాలని ఆశించి భంగపడ్డవారే. కృష్ణ కూతురు మంజుల ఈ విషయంలో ఎంతగా డిజప్పాయింట్ అయిందో మీడియా వాళ్లకే నేరుగా చెప్పేసింది. ఒకట్రెండు సినిమాల్లో నటించి ముచ్చట తీర్చుకుంది కానీ.. ఆమె ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయింది. అక్కినేని ఫ్యామిలీ అమ్మాయి సుప్రియ ఒకే ఒక్క సినిమాతో తెరమరుగైంది. ఇప్పుడు మంచు లక్ష్మి మాత్రమే సినీ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంది. ఐతే లక్ష్మి లాగే తన రంగుల కలలు నెరవేర్చుకోవడానికి మరో అమ్మాయి రెడీ అవుతోంది. ఆమే.. కొణెదల వారమ్మాయి నిహారిక.

నాగబాబు తనయురాలికి ముందు నుంచి సినిమాల్లో వెలిగిపోవాలని కోరిక. అందుకే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత ఢీ జూనియర్స్, గప్ చుప్ లాంటి టీవీ షోలు కూడా చేసింది. కానీ సినిమాల్లో నటించడానికి మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఐతే గ్లామరస్ రోల్స్ జోలికి వెళ్లనని.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించి తన ముచ్చట తీర్చుకుంటానని.. తండ్రిని, పెదనాన్నని ఒప్పించడంతో త్వరలోనే ఆమె తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిహారిక, నాగబాబు కలిసి కథలు వింటున్నారట. ఏదైనా సబ్జెక్టు నచ్చితే సొంతంగా సినిమా నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి త్వరలోనే కొణెదల వారమ్మాయి తెరంగేట్రం చూడబోతున్నామన్నమాటే.