Begin typing your search above and press return to search.

సంపూ.. ఇన్నాళ్లు ఏం చేశావ్?

By:  Tupaki Desk   |   1 Sep 2015 11:40 AM GMT


హృదయ కాలేయం సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోతోంది. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ఆ విజయోత్సాహంలో సంపూ అండ్ కో ‘కొబ్బరిమట్ట’ అనౌన్స్ చేశారు. ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీఫెన్ శంకర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ.. రూపక్ రొనాల్డ్ సన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మధ్య మధ్యలో ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చారు. భారీ క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు ప్రెస్ నోట్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు. సంపూ పాడిన కొబ్బరిమట్ట టైటిల్ సాంగ్ టీజర్ కూడా రిలీజ్ చేసి హడావుడి చేశారు. ఈ హంగామా చూసి కొబ్బరిమట్ట షూటింగ్ అంతా అయిపోయిందేమో.. త్వరలోనే రిలీజ్ కూడా చేసేస్తారేమో అనుకుంటే.. సడెన్ గా ఇప్పుడు షూటింగ్ మొదలవుతున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మారుతి వాళ్ల ‘గుడ్ సినిమా గ్రూప్’తో కలిసి స్టీఫెన్ శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘‘కొందరు కులం నుంచి పుడతారు. కొందరు జనంలోంచి పుడతారు.. కానీ పుట్టుకతో మీసమున్న ఒక వీరుని కథ’’ అంటూ కొబ్బరిమట్ట మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ రోజు. బాహుబలి తరహాలో పసిబిడ్డగా సంపూను చూపిస్తూ చాలా భారీగానే పోస్టర్ డిజైన్ చేశారు. ఐతే అంతా బాగానే ఉంది కానీ.. సంపూతో ఇలాంటి పేరడీ కామెడీ ఇంకెంతో కాలం నడవదని ‘సింగం 123’ సినిమాతో రుజువైంది. పోస్టర్, మిగతా వ్యవహారాలు చూస్తుంటే ‘కొబ్బరిమట్ట’ కూడా పేరడీ టైపులాగే ఉంది. మళ్లీ సంపూ ఇలా భారీ బిల్డప్పులిస్తే జనాలు తట్టుకుంటారా అని డౌటొస్తోంది.