నిఖిల్ పార్టీ.. సేఫ్ అయినట్లే

Tue Mar 20 2018 16:42:39 GMT+0530 (IST)

కొన్ని వారాలుగా కళ తప్పిన టాలీవుడ్ బాక్సాఫీస్ లో గత శుక్రవారం మళ్లీ కొంచెం ఊపు వచ్చింది. చాన్నాళ్ల తర్వాత ‘కిరాక్ పార్టీ’ రూపంలో ఒక యూత్ ఫుల్ మూవీ ప్రేక్షకుల్ని పలకరించింది. మూవీ బఫ్స్ ఆవురావురుమని ఉన్న సమయంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిఖిల్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. రెండో రోజు నుంచి వసూళ్లు కొంచెం తగ్గినా.. డ్రాప్ మరీ ఎక్కువగా ఏమీ లేదు. డివైడ్ టాక్ ను తట్టుకుని కూడా ఈ చిత్రం బాక్సఫీస్ దగ్గర నిలబడగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.6 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. గ్రాస్ రూ.10 కోట్లు దాటింది.అమెరికాలో ‘కిరాక్ పార్టీ’ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. అక్కడ ఈ చిత్రం రూ.2 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రిమియర్లు.. తొలి రోజు వసూళ్లతోనే ‘కిరాక్ పార్టీ’ అక్కడ పెట్టుబడిని వెనక్కి తెచ్చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు చేరువగా ఉన్నారు. నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని తెలివిగా మార్కెట్ చేసుకున్నాడు. లాభానికే సినిమాను అమ్ముకున్నాడు. శాటిలైట్.. డిజిటల్.. హిందీ డబ్బింగ్ హక్కుల్ని విడుదలకు ముందే అమ్మేశాడు. మొత్తంగా రూ.10 కోట్లకు పైగానే ఆదాయం చేసుకున్నాడు. అన్ని ఖర్చులూ కలిపితే ఈ చిత్ర బడ్జెట్ రూ.7-8 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు ఓ మోస్తరుగా ఉండటంతో బయ్యర్లందరూ లాభాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.