హిందీ అర్జున్ రెడ్డిలో చరణ్ హీరోయిన్

Sun Sep 23 2018 14:33:59 GMT+0530 (IST)

కల్ట్ క్లాసిక్ గా లవ్ స్టోరీస్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అర్జున్ రెడ్డిలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో అంతే సమానంగా హీరోయిన్ కూ ఉంది. అందుకే విజయ్ దేవరకొండతో పాటు షాలిని పాండే యూత్ కు చాలా కాలం అలా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వివిధ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ తో బాలా చేసిన ఈ రీమేక్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. హిందీలో గెడ్డం పెంచడం కోసం ఆలస్యం చేసిన హీరో షాహిద్ కపూర్ ఆ పని కూడా పూర్తయిపోవడంతో త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఒరిజినల్ వెర్షన్ టేకప్ చేసిన సందీప్ రెడ్డి వంగానే దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటిదాకా హీరోయిన్ కోసం తర్జన భర్జనలు చేసిన టీమ్ చివరికి మహేష్ తో భరత్ అను నేనులో బోయపాటి సినిమాలో రామ్ చరణ్ సరసన చేసిన క్యూట్ బ్యూటీ కియారా అద్వానీని లాక్ చేశారట. ఆ మేరకు అంతా ఓకే అయిపోయిందని సమాచారం.నిజానికి ఈ రీమేక్ కు ఫ్రెష్ బ్యూటీ అయితే బాగుంటుందని మొదట మోడల్ తారా సుతారియాను తీసుకున్నారు. కానీ తన డెబ్యూ మూవీ స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 షూటింగ్ ఆలస్యం కావడంతో తో పాటు దాని నిర్మాత కరణ్ జోహార్ తో ఒప్పందం మేరకు ఇది వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సమయం మీరిపోవడంతో సందీప్ వంగా ఎక్కువ ఆలస్యం చేయకుండా కియారాను ఓకే చేసుకున్నట్టు తెలిసింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ వెబ్ మూవీ ద్వారా పాపులారిటీ పెరిగిపోయిన కియారాకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. కియారా పేరుని షాహిద్ రికమండ్ చేసాడట. ఇద్దరు కలిసి ఇటీవలే ప్రేమికుడు సినిమాలో ఆల్ టైం హిట్ సాంగ్ ఊర్వశి ఊర్వశి డాన్సింగ్ నెంబర్ కు వీడియో వెర్షన్ లో కలిసి డాన్స్ చేసారు. ఆ కెమిస్ట్రీ చూసాకే యూనిట్ కూడా ఏకాభిప్రాయానికి వచ్చిందట. మొత్తానికి మహేష్ చరణ్ ల బ్యూటీ రెండు చోట్లా బిజీగా ఉంటూ కెరీర్ ను చక్కదిద్దుకునే పనిలో ఉంది. గ్లామర్ షోకి పెద్దగా అభ్యంతర పెట్టని కియారా అర్జున్ రెడ్డిలో బోల్డ్ సీన్స్ కి మాత్రం వద్దు అంటుందా. నో ఛాన్స్.