Begin typing your search above and press return to search.

వేల‌కోట్ల అధిప‌తులు కేర‌ళ‌కేం చేశారు?

By:  Tupaki Desk   |   20 Aug 2018 4:18 AM GMT
వేల‌కోట్ల అధిప‌తులు కేర‌ళ‌కేం చేశారు?
X
కేర‌ళ మ‌హావిళ‌యం ప్ర‌పంచాన్ని క‌దిలించేస్తోంది. చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని విప‌త్తు ఇది. దాదాపు 100ఏళ్ల త‌ర్వాత 250 సెం.మీట‌ర్ల వ‌ర్షం ఒక్క కేర‌ళ‌ను ముంచెత్తిందంటే అక్క‌డ స‌న్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వంద‌లాది జ‌నం చ‌నిపోయార‌ని చెబుతున్నా, లెక్క‌తేల‌ని మృతుల సంఖ్య‌ - ఆస్తిన‌ష్టం ఎంతో అంచ‌నా వేయొచ్చు. ఇలాంటి పెను విప‌త్తు వేళ సినీ సెల‌బ్రిటీలు స్పందిస్తున్న తీరు ప్ర‌శంస‌నీయం. త‌మ‌కు తోచినంతా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ విష‌యంలో పొరుగు రాష్ట్రం కేర‌ళ కోసం టాలీవుడ్ - కోలీవుడ్ ప్ర‌ముఖులు స్పందించిన తీరును ప్ర‌శంసించి తీరాల్సిందే. కేవ‌లం టాలీవుడ్ నుంచి దాదాపు 2కోట్ల మేర కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కి చేరనుంది. ఆ మేర‌కు అన్ని కాంపౌండ్‌ లు ల‌క్ష‌ల్లో విరాళాల్ని ప్ర‌క‌టించాయి. అలానే కోలీవుడ్‌ లోనూ స్టార్లంతా స్పందించి ల‌క్ష‌ల్లో విరాళాలు ప్ర‌క‌టించారు. కోలీవుడ్ నుంచి 2 కోట్లు పైగానే విరాళాలు వెల్లువెత్తి ఉంటాయ‌ని ఓ అంచ‌నా.

ఎవ‌రికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. మంచి అనిపించుకుంటున్నారు. అయితే ఇలాంటి వేళ దేశానికే పెద్ద‌న్న అని చెప్పుకునే బాలీవుడ్ జ‌నం చేసిన సాయం మాత్రం గుండు సున్నా. పొరుగు రాష్ట్రం .. పైగా ఉత్త‌రాది రాష్ట్రం కాద‌ని భావించారో ఏమో అట్నుంచి అణా పైసా విదిల్చేందుకు కూడా ఎవ‌రూ సిద్ధంగా లేర‌ని స‌న్నివేశం చెబుతోంది. ఏదైనా అంటే సామాజిక మాధ్య‌మాల్లో ఊద‌ర‌గొట్టుడు ఉప‌న్యాసాలు దంచుతున్నారు. ఈ విప‌త్తుకు ప్ర‌జ‌లంతా సాయం చేయాల‌ని బాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ - ఫేస్‌ బుక్‌ లో కోరుతున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం? మాట్లాడితే వంద‌లు కాదు - వేల కోట్ల సామ్రాజ్యాల్ని విస్త‌రించి ఏ ఊళ్లో ఎన్ని ఆస్తులున్నాయో చెప్పుకోలేనంత సంపాదించారు. అందులో ఖాన్‌ ల త్ర‌యం గురించి గొప్ప‌గా చెబుతుంటారు. అమితాబ్‌ - ర‌ణ‌బీర్ - ర‌ణ‌వీర్ లాంటి హీరోలు భారీగా ఆర్జించే హీరోలుగా ద‌శాబ్ధాలుగా రాజ్య‌మేలుతున్నారు. ప్ర‌పంచంలోనే ధ‌నార్జ‌న‌లో మేటి హీరోలుగా ఫోర్బ్స్ జాబితాల‌కెక్కిన‌వారే. కానీ వీళ్ల‌నుంచి కేర‌ళ‌కు అణాపైసా దానానికి సంబంధించిన‌ ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. పైపెచ్చు ఈ ప‌రిస్థితిలో కేర‌ళ‌ను ఆదుకోవాల్సి ఉంద‌ని స‌న్నాయి నొక్కులు త‌ప్ప అస్స‌లు ప్ర‌యోజ‌న‌క‌ర ప్ర‌క‌ట‌న ఒక్క‌టి కూడా లేదు. ఇలాంటి వేళ ఏదో కంటితుడుపు చ‌ర్య‌గా కింగ్‌ ఖాన్ షారూక్ త‌న మీర్ ఫౌండేష‌న్ ద్వారా 21ల‌క్ష‌లు ప్ర‌క‌టించాడు. అదొక్క‌టే ఉత్త‌రాది నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌.

వేలకోట్లు సంపాదిస్తే ఏం ఉప‌యోగం? ఇలాంటి భీక‌ర విప‌త్తు స‌న్నివేశంలో ఇరుగుపొరుగును ఆదుకోవాల‌న్న జ్ఞానం లేక‌పోవ‌డం ఘోరం. అస‌లు మాన‌వ‌త అన్న ప‌దానికే సిగ్గు చేటు. కేవ‌లం ఇలా సినిమావాళ్ల‌నే తిట్ట‌డం క‌రెక్ట్ కాదేమో! బ‌డా బ‌డా ఇండ‌స్ట్రియ‌లిస్టులు - వ్యాపార‌వేత్త‌లు ఇండియాలో ఫోర్బ్స్ జాబితాల‌కెక్కిన ఘ‌నులు పదుల సంఖ్య‌లోనే ఉన్నారు. వీళ్లంతా ఈ విప‌త్తు వేళ ఏమైపోయారో తెలియ‌డం లేదు. ఇది అత్యంత దారుణం.