సింగర్ సునీత కూతురు ఎంట్రీ..!

Sun Oct 21 2018 17:50:40 GMT+0530 (IST)

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. కాని ప్రేక్షకులు గుర్తించ దగ్గ సింగర్స్ మాత్రం కొద్ది మందే ఉంటారు. ఎక్కువ శాతం సింగర్స్ ఇలా వచ్చి అలా వెళ్లి పోతూ ఉంటారు. కాని కొందరు సింగర్స్ మాత్రం అలా ఉండి పోయారు. అందులో ఒక సింగర్ సునీత. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న సునీత తన కూతురు శ్రియ గోపరాజును కూడా సింగర్ గా పరిచయం చేసింది. సునీతకు ఒక కూతురు - ఒక కొడుకు ఉన్నాడనే విషయం తెల్సిందే. కూతురు గాయనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు స్వరపర్చిన ‘సవ్యసాచి’ సినిమాలోని ఒక పాటను శ్రియ గోపరాజు పాడినట్లుగా తెలుస్తోంది. డ్యూయెట్ సాంగ్ తో శ్రియను పరిచయం చేయడం జరుగుతుందని మంచి గాత్రంతో తన మొదటి పాటకు పూర్తి న్యాయం చేసిందని కీరవాణి స్వయంగా శ్రియపై అభినందలు తెలిపినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.

సునీత వాయిస్ తో పోల్చితే శ్రియ వాయిస్ చాలా విభిన్నంగా వెస్ట్రన్ స్టైల్ లో ఉందని కీరవాణి గారు అన్నారు. కీరవాణితో తన కూతురు శ్రియ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో సునీత పోస్ట్ చేయడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. తను చాలా టెన్షన్ ఫీల్ అయ్యింది కాని కీరవాణి గారు శ్రియకు ధైర్యం చెప్పి ఒక మంచి పాటను పాడే అవకాశం కల్పించారు. ఫస్ట్ రికార్డింగ్ శ్రియకు ఎప్పటికి గుర్తుండి పోవాలని కోరుకుంటున్నాను అంటూ సునీత పోస్ట్ చేసింది. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రియకు మొదటి పాట అనుభవం అనుభూతి ఎలా ఉండబోతుందో చూడాలి.