Begin typing your search above and press return to search.

ఓపెన్ అయి..ఉతికేసిన కీరవాణి సంచలన ట్వీట్లు

By:  Tupaki Desk   |   26 March 2017 2:41 PM GMT
ఓపెన్ అయి..ఉతికేసిన కీరవాణి సంచలన ట్వీట్లు
X
గతంలో మనసులో మాటలు చెప్పుకోవాలంటే వేదికలు చాలా పరిమితంగా ఉండేవి. ఇప్పుడలా కాదు.. బోలెడన్నిఅవకాశాలున్నాయి. మనసులో ఏం అనుకుంటే.. దాన్ని అనేయటమే కాదు.. జనస్వామ్యంలోకి తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది.ఒకప్పుడు ఏదైనా చెప్పాలంటే మీడియా మాత్రమే దిక్కు అయ్యేది. ఒకవేళ.. మీడియా ఓకే అన్నా.. చెప్పాలనుకున్నదంతా చెప్పే అవకాశం ఉండేది కాదు. సోషల్ మీడియా అలాంటి పరిమితుల్ని చెరిపేసింది. గుండెల్లోని మాటల్నిచెప్పుకునే వెసులుబాటు ఇప్పుడున్నంతగా ఇంతకు ముందెప్పుడూ లేదనే చెప్పాలి. ఎందుకిదంతా అంటే.. చాలా పరిమితంగా మాట్లాడే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. ఈ రోజు ఓపెన్ అయ్యారు.

ఎంతలా అంటే.. ఆయన మనసులోని భావాలన్నింటిని ట్వీట్లతో బయటపెట్టేశారు. సంచలనాలకు దూరంగా ఉండే కీరవాణి లాంటి వ్యక్తి.. సంచలనాలకు కేంద్రంగా మారటమే కాదు.. సినీ పరిశ్రమ.. సినీ అభిమానులతో పాటు..అందరూ మాట్లాడుకునేలా ఆయన ట్వీట్లు ఉండటం గమనార్హం. సంగీతదర్శకుడిగా తన కెరీర్ కు సంబంధించి.. ఇప్పటివరకూ తనకు ఎదురైన అన్ని అంశాల్ని ఆయన చెప్పుకొచ్చారు. తన 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో కీలక మైలురాళ్లను అందుకున్న ఆయన.. తాజాగా చేసిన ట్వీట్ల పరంపరను చూస్తే..

= నా జీవితం మౌళిసర్ తో మొదలైతే.. 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను ‘‘రాజమౌళి’’తో ఉన్నా.

= రాజమౌళితో నేనున్నంత కాలం అతన్ని ఎవరూ అందుకోలేరు. కానీ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకునే సమయం నా కోసం ఎదురుచూస్తోంది.

= రాజమౌళి సినిమాలకు మాత్రమే అద్భుతమైన సంగీతం అందించడానికి కారణం.. అతను నేను చెప్పేది ప్రతిదీ వింటాడు.

= చాలామంది దర్శకులు నన్నో సంగీత దర్శకుడిగా మాత్రమే చూసేవారు.. మంచి సలహా తీసుకోవడంలో శ్రద్ధ చూపేవారు కాదు.

= దర్శకులు కథ చెప్పే సమయంలోనే ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందని అంచనా వేసేవాడ్ని. కానీ.. దర్శకులు మాత్రం వినేవారు కాదు.

= వినకపోవడం అనేది మంచి ట్యూన్లకు ఏ మాత్రం హాని చేయదు. కానీ మంచి సలహాను పెడచెవిన పెడితే డైరెక్టర్‌కు కచ్చితంగా ఎదురుదెబ్బే. అతని చిత్రంతో పాటు.. వ్యక్తిగత కెరీర్‌పైనా చెడు ప్రభావం చూపుతుంది.

= బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశా. వారు నా మాటలు వినేవారు కాదు.

= సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని రెండేళ్ల కిత్రమే ప్రకటించా. దీనిపై మిశ్రమ స్పందన లభించింది.

= నేను సినిమాల నుంచి దూరం కాకూడదని 99శాతం మందిని కోరుకున్నారు. ఇందులో నా కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. అభిమానులున్నారు. కొందరు మాత్రమే సంతోషంగా ఉన్నారు.

= దేవుడు నాకు జయాపజయాలు రెండూ ఇచ్చాడు. ఈ విషయంలో ఎలాంటి బాధా లేదు. ప్రతిసారీ ఓ పాఠం నేర్చుకున్నా.

= ఒకవేళ నేను కెరీర్‌ కొనసాగించాల్సి వస్తే.. నా శ్రేయోభిలాషుల కోసమే పని చేస్తా. అంతేకానీ నా మాటను వినిపించుకోని.. పట్టించుకోని వారి కోసం పనిచేయను. ఎందుకంటే సంగీత దర్శకుడిగా నేనెప్పుడూ గర్వంగా ఫీల్‌ కాలేదు.

= నాలో ఉన్న రచయితను చూసి గర్వ పడతా.

= నా రిటైర్‌ మెంట్‌ పై ధైర్యంగా, నేరుగా మద్దతు తెలిపిన వ్యక్తి.. అనంత శ్రీరామ్‌ ఒక్కడే.

= తమన్‌ నా రిటైర్మెంట్ టైం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. నా అసిస్టెంట్ జీవన్‌ను పలుమార్లు ఆ విషయం గురించి అడిగాడు.

= తమన్‌ నాకు వీరాభిమాని. మంచి ప్రోగ్రామర్‌ అయిన జీవన్‌ అతనికి కావాలి.

= ‘బాహుబలి 1’ భారీ ఘన విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. డైరెక్టర్‌..నిర్మాతలు.. వారాహి సాయిగారితో సహా.. అంబికా కృష్ణ సానుకూలంగా ఆలోచించారు. ఇలాంటి విజయం వస్తుందని నేను చాలా నమ్మకంగా ఉన్నా.

= క్రాంతికుమార్‌ సర్‌ని పొగొట్టుకున్నా. ఆయన చాలా అహంకారి. కానీ టాలెంట్‌కు గౌరవం ఇచ్చేవారు.

= నేను నా తల్లిదండ్రులు.. నా కుటుంబ సభ్యులు.. గురువులు..అసిస్టెట్లు..ఫ్యాన్స్.. మీడియా వారికి నా కృతజ్ఞతలు.

= రామోజీ రావు.. కృష్ణంరాజు.. రాఘవేంద్రరావు.. బాలచందర్.. మహేష్ భట్ (అందరిని గార్లు అంటూ ప్రస్తావించారు)లందరి కృతజ్ఞతలు.

= మంచి.. చెడు.. టైమ్ ఏదైనా కానీ.. నాగార్జున ఎప్పుడూ నా చేతిని వదల్లేదు. ‘‘తెలుసా మనసా’’ పాటలో మధ్యలో చెప్పిన మాటల మాదిరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/