కీరవాణి ట్వీట్.. కొత్త కలకలం

Fri May 19 2017 17:05:51 GMT+0530 (IST)

‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ముందు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చేసిన ట్వీట్లు పెద్ద సంచలనానికే దారి తీశాయి. తాను కొందరు బుర్ర లేని దర్శకులతో పని చేశానని.. వేటూరి వెళ్లిపోయాక.. సిరివెన్నెల జోరు తగ్గించేశాక తెలుగు సినిమా సాహిత్య ప్రమాణాలు పడిపోయాయని ఆయన చేసిన ట్వీట్లు చాలామందిని హర్ట్ చేశాయి. కీరవాణిపై విమర్శలకు దారి తీశాయి. ఐతే ఈ వ్యాఖ్యలపై ఆ తర్వాత ఏదో సర్దిచెప్పి సైలెంటయ్యాడు కీరవాణి. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ మరోసారి పెద్ద చర్చనీయాంశం అయింది.

‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద తన పొగడ్తల వర్షాన్ని కొనసాగిస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ కు కీరవాణి స్పందించాడు. ప్రస్తుతం హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో నెంబర్ వన్ సినిమా.. తెలుగు నుంచి డబ్ అయినదని ట్వీట్ చేశాడు వర్మ. దీనికి బదులుగా.. ‘‘ఇదే నిజమైతే బాహుబలి-2 మలయాళ వెర్షన్ కోసం పాట పాడమని ఓ బాలీవుడ్ ప్రముఖ సింగర్ ను అడిగితే అవమానంగా ఎందుకు భావించాడో’’ అని ట్వీట్ చేశాడు కీరవాణి. దీంతో ఎవరా ఎవరా సింగర్.. ఏమా కథ అన్న చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. సాహోరే బాహుబలి పాట పాడిన దలేర్ మెహందీనే ఆ సింగరా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తే.. తెలుగు.. తమిళంలో పాడిన సింగర్.. మలయాళంలోకి వచ్చేసరికి ఎందుకు నో అంటాడు అని ఆ వాదనను తోసిపుచ్చారు. మరి ఆ సింగర్ ఎవరన్నది కీరవాణికే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/