జక్కన్న - కీరవాణి అరుదైన గౌరవం

Mon Mar 25 2019 10:47:57 GMT+0530 (IST)

బాహుబలి 1 2 చిత్రాలు రిలీజై చాలా కాలమే అయ్యింది. 2016 2017లో వరుసగా ఈ రెండు సినిమాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని వేటాడి సంచలనాలు సృష్టించాయి. ఈ సినిమాలు సాధించిన ఘనత గురించి ఇప్పటికీ ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాహుబలి చిత్రంలోని శివగామి పాత్రను ప్రధాన పాత్రగా ఎంపిక చేసుకుని నెట్ ఫ్లిక్స్ ఏకంగా వెబ్ సిరీస్ నే రన్ చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. అలాగే బాహుబలి టీమ్ కి ఎన్నో గౌరవాలు సత్కారాలు దక్కాయి. ఇండియాలో ది బెస్ట్ అనదగ్గ ఐఐఐటీల్లో ఎస్.ఎస్.రాజమౌళి గెస్ట్ లెక్చర్లు ఇచ్చారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పారు. దేశ విదేశాల్లో ప్రముఖ యూనివర్శిటీల నుంచి జక్కన్న పిలుపును అందుకున్నారు. ఇదంతా తెలుగు వారి ప్రతిభకు దక్కిన గొప్ప గౌరవంగా భావించాలి.మరోసారి అలాంటి గౌరవమే దక్కనుంది. `బాహుబలి : ది బిగినింగ్` చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్స్ హాల్ - లండన్ లో ప్రదర్శించనున్నారు. ఈ తరహాలో సౌత్ నుంచి అర్హత సాధించిన ఏకైక సినిమా ఇదే. హాలీవుడ్ బ్లాక్ బస్టర్లు స్కై ఫాల్ హ్యారీ పోటర్ అండ్ ది గోబ్లెట్ ఫైర్ చిత్రాలతో పాటుగా బాహుబలి1 చిత్రాన్ని ఈ ప్రతిష్ఠాత్మక హాల్ లో ప్రదర్శించనున్నారు. అంతేకాదు.. ఇక్కడ ఈ సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సంబంధించిన లైవ్ కాన్సెర్ట్ ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాహుబలి 1 హిందీ వెర్షన్ ని స్క్రీనింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా రీరికార్డింగ్ వర్క్ గురించి ఎం.ఎం.కీరవాణి లైవ్ లో లెక్చర్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎస్.ఎస్.రాజమౌళి కీరవాణి బృందం లండన్ పయనం కానున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 19న ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అప్పటికి ఆ ఇద్దరూ ప్రిపేరవుతారట. లైవ్ కాన్సెర్ట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి సినిమా గురించి ఆ ఇద్దరూ కొన్ని ప్రశ్నల్ని ఎదుర్కొంటారు. ఇలాంటి అరుదైన గౌరవం వేరొక సౌత్ ఇండియన్ కి ఇదివరకూ లేనేలేదు.  ప్రస్తుతం రాజమౌళి- కీరవాణి జోడీ ప్రతిష్ఠాత్మక ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణితో రాజమౌళి సింక్ గురించి అంతే ఆసక్తికరంగా అభిమానుల్లో చర్చ సాగుతుంటుంది.