కత్తి కాంతారావు లుక్ లీక్

Mon Dec 17 2018 11:43:39 GMT+0530 (IST)

ఏఎన్నార్ - ఎన్టీఆర్ లకు సమకాలికుడైన కత్తి కాంతారావు ప్రతిభ గురించి తెలుగు వారికి పరిచయం అవసరం లేదు. జానపద- పౌరాణికాల్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఎంత గొప్ప హీరోగా వెలిగిపోయారు. టాలీవుడ్ హిస్టరీ తొలి నాళ్లలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతిభావంతుడిగా కాంతారావుకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన జీవితకథను వెండితెరకెక్కించే ప్రయత్నం సాగుతోంది. చంద్రాధిత్య ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై సీనియర్ దర్శకులు పి.సి.ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాంతారావు కథపై కసరత్తు పూర్తయింది. కాంతారావు స్వస్థలంలో పరిశోధించి - వివరాలు సేకరించి పూర్తి స్క్రిప్టుని రూపొందించారట.  `రాకుమారుడు` అనే టైటిల్ ని ఇదివరకూ ప్రకటించారు. ఇప్పటికే  పాటల రికార్డింగ్ పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారట.తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే కాంతారావు పాత్రధారిపై ఫోటోషూట్ పూర్తయింది. కాంతారావుగా అఖిల్ సన్నీ నటిస్తున్నారు. తాజాగా లుక్ కూడా లీకైంది. ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. ఇంచుమించు కాంతారావు పోలికలు ఈ యువకుడిలో కనిపిస్తున్నాయి. అయితే నటన పరంగా ఆ స్థాయిలో రాణిస్తాడా లేదా? అన్నది తెరపై చూడాలి. ఇక ఈ చిత్రంలో ఎంజీఆర్ గా చెన్నయ్ కి చెందిన సురేషన్ నటిస్తున్నారు. త్వరలోనే రాజనాల - ఎన్టీఆర్ - ఏఎన్నార్ - విఠలాచార్య - కృష్ణకుమారి - రాజశ్రీ పాత్రలకు సంబంధించిన లుక్ లను రివీల్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో కాంతారావు చివరి జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఘట్టాల్ని ప్రత్యేకంగా స్క్రిప్టులో హైలైట్ చేస్తున్నారట. ఎంతో గొప్ప స్టార్ గా వెలిగిన కాంతారావు కొన్ని తప్పిదాల వల్ల చివరి నాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయి సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు 100 సినిమాల్లో హీరో. 200పైగా చిత్రాల్లో రకరకాల పాత్రల్లో నటించిన ఆయన లైఫ్ ప్లాన్డ్ గా లేకపోవడమే ఈ ఇబ్బందులకు కారణమని ఆయన జీవితంలో సందేశం ఉంది.. గుణపాఠం ఉంది అని దర్శకుడు ఇదివరకూ చెప్పారు. ఈ సినిమాకి కథ - కథన రచన సహా దర్శకత్వ బాధ్యతల్ని పీసీ ఆదిత్య స్వయంగా నిర్వహిస్తున్నారు.