Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: కాష్మోరా

By:  Tupaki Desk   |   28 Oct 2016 9:53 AM GMT
మూవీ రివ్యూ: కాష్మోరా
X
చిత్రం : ‘కాష్మోరా’

నటీనటులు: కార్తి - నయనతార - శ్రీదివ్య - వివేక్ - శరత్ లోహితాశ్వ - మధు తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు: పరమ్ పొట్లూరి - పెర్ల్ పొట్లూరి - కవిన్ అన్నె- ప్రకాష్ బాబు - ప్రభు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గోకుల్

కొన్ని నెల కిందటి వరకు కార్తి సినిమా ‘కాష్మోరా’ గురించి పెద్దగా పట్టింపు లేదు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ చూడగానే ఒక్కసారిగా ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ట్రైలర్ చూశాక ఆ ఆసక్తి మరిన్ని రెట్లు పెరిగింది. ఈ సినిమా కోసం అటు తమిళం.. ఇటు తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

కాష్మోరా (కార్తి) ఆత్మల్ని తరిమికొట్టే బాబాగా అందరినీ నమ్మిస్తుంటాడు. కానీ అతనో బురిడీ బాబా. అతడి మోసానికి ఓ మంత్రి సైతం లొంగిపోతాడు. ఐతే అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో తాను కొనుగోలు చేసిన కోటలో ఉన్న దయ్యాల్ని తరిమి కొట్టాలంటూ ఓ వ్యక్తి కాష్మోరాను కలుస్తాడు. అతడిచ్చే డబ్బు కోసం కాష్మోరా ఆ కోటకు వెళ్తాడు. అక్కడ అతడికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాడు. ఆ కోటలో వందల ఏళ్లుగా దయ్యమై తిరుగుతున్న రాజ్ నాయక్.. కాష్మోరాతో పాటు అతడి కుటుంబ సభ్యుల్ని కూడా లోపల బంధిస్తాడు. ఇంతకీ అతనలా ఎందుకు చేశాడు.. రాజ్ నాయక్ గతమేంటి.. ఈ కోట నుంచి కాష్మోరా ఎలా బయటపడ్డాడు అన్నది మిగిలిన కథ.

కథనం - విశ్లేషణ:

కాష్మోరా.. ఏదో ఒక్క జానర్ కు పరిమితం చేయలేని సినిమా. కొంత వరకు హార్రర్ కామెడీ బాటలో నడుస్తుంది. ఇంకొంత ఫాంటసీలా సాగుతుంది. మరికొంత పీరియడ్ ఫిలింలా ఉంటుంది. ఐతే వీటిలో ఏదీ అంత ప్రత్యేకమైన అనుభూతినివ్వదు. మూడు జానర్లనూ మిక్స్ చేసిన గోకుల్ అందించిన కిచిడీ మూవీ ఇది. మగధీర.. అరుంధతి.. బాహుబలి లాంటి సినిమాల సరసన నిలపాలని వాటి ఫార్మాట్లోనే కథను నడిపించే ప్రయత్నం చేసినా.. వాటిలో మాదిరే ఇందులోనూ భారీతనం.. కళ్లు చెదిరే ఆర్ట్ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా.. పర్ఫెక్షన్.. ఇంటెన్సిటీ లోపించడం వల్ల.. సినిమాను కామెడీగా నడిపించడం వల్ల.. ‘కాష్మోరా’ వాటికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయింది.

‘కాష్మోరా’ నుంచి ప్రేక్షకులు ఆశించింది ఒకటైతే.. దర్శకుడు ఇంకోటి ఇస్తాడు. పేరు చూసి.. ట్రైలర్ చూసి.. సినిమా అంతటా ఒక అద్భుత లోకంలో విహరింపజేస్తారన్న అభిప్రాయానికి వస్తాం కానీ.. ఆ లోకంలో మనల్ని ఉంచేది ఓ అరగంట మాత్రమే. ఆ అర గంట ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా మామూలుగా సాగుతుంది. ఇలాంటి భారీ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నపుడు.. ముందుగా ప్రేక్షకుల్ని ఆ దిశగా సిద్ధం చేయడం.. ఆ మూడ్ క్రియేట్ చేయడం కీలకం. ఐతే దర్శకుడు గోకుల్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. మొదట్నుంచి కథనాన్ని లైటర్ వీన్లోనే నడిపించాడు.

కామెడీ ప్రధానంగా కథను నడపడం వల్ల ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చే సమయానికి ప్రేక్షకుడి మూడ్ మరోలా ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో భారీతనానికి లోటు లేకపోయినా.. అది కేవలం అరగంటే ఉండటం.. అంత తక్కువ సమయంలో ఇంటెన్సిటీ చూపించలేకపోవడం వల్ల.. అది అనుకున్న స్థాయిలో ప్రేక్షకులపై ఇంపాక్ట్ వేయదు. ఐతే ఆ ఎపిసోడ్లోని భారీతనం.. నటీనటుల ప్రతిభ..విజువల్స్.. సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్.. ఇలాంటి అదనపు ఆకర్షణలు ఎన్ని ఉన్నా.. ఆ ఎపిసోడ్లో సోల్ మాత్రం మిస్సయింది. ఆశించిన స్థాయిలో ఎగ్జైట్మెంట్ ఇవ్వదు ఆ ఎపిసోడ్.

ఇక సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రధాన అంశం.. కామెడీ. బురిడీ బాబా కాష్మోరా పాత్రలో కార్తి పండించిన వినోదం సినిమాకు ప్రధాన ఆకర్షణ. జనాల్ని బోల్తా కొట్టించే సన్నివేశాల్లో కానీ.. దయ్యానికి తాను దొరికిపోయినపుడు దాంతో పరాచికాలాడే సీన్లో కానీ.. కార్తి పండించిన కామెడీ బాగా నవ్విస్తుంది. ప్రథమార్ధం బోర్ కొట్టకుండా సాగిపోతుంది కానీ.. అందులో కథంటూ ఏమీ ఉండదు. ఇంటర్వెల్ ముందు అసలు కథ మొదలవుతుంది. దురదృష్టవశాత్తూ కథ మొదలుకానంత వరకే సినిమా ప్రేక్షకుల్ని టైంపాస్ చేయిస్తుంది. ఆ తర్వాత వ్యవహారమంతా గందరగోళంగా.. ఒక దిశా దశా లేకుండా సాగుతూ ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తుంది. ద్వితీయార్ధంలో ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. తీరా అది మొదలయ్యాక అనుకున్న స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందుతాం.

ఫ్లాష్ బ్యాక్ ముగియగానే సినిమా ఎలా ముగియబోతోందో ఒక అంచనాకు వచ్చేస్తాం. ఐతే వెంటనే సినిమాను ముగించకుండా సాగదీశారు. సినిమా మీద ఉన్న కొంచెం ఇంప్రెషన్ కూడా పోయేలా సాగుతుంది క్లైమాక్స్. నిడివి రెండున్నర గంటలకు పైగా ఉండటం సినిమాకు కచ్చితంగా మైనస్. ద్వితీయార్ధంలో ఇష్టానుసారం సన్నివేశాలు పేర్చేశారు. ఓ 20 నిమిషాల నిడివి అయినా తగ్గించాల్సింది. విడివిడిగా చూస్తే కొన్ని పార్ట్స్.. కొన్ని అంశాలు బాగానే అనిపించినా.. ఓవరాల్ గా ‘కాష్మోరా’ ఒక కంప్లీట్ మూవీ ఫీలింగ్ ఇవ్వదు.

నటీనటులు:

పెర్ఫామెన్స్ పరంగా కార్తి కెరీర్లో ‘కాష్మోరా’ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండు పాత్రల్లోనూ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ముఖ్యంగా రాజ నాయక్ పాత్రలో అతణ్ని చూసి షాకవుతాం. ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా ఆ పాత్రలో క్రౌర్యాన్ని పెంచే ప్రయత్నమేదో జరిగినా.. ఈ పాత్ర కోసం కార్తి పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్.. హావభావాలు.. నటన అన్ని రకాలుగా ఈ పాత్రతో మెప్పించాడు కార్తి. కాష్మోరా పాత్రలో కామెడీ కూడా బాగానే పండించాడు. కాష్మోరా.. రాజ నాయక్ పాత్రల్లో ఉన్నది వేర్వేరు వ్యక్తులే అనిపించేలా వేరియేషన్ చూపించాడు కార్తి. సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో. నయనతార కనిపించేది కాసేపైనా తనదైన ముద్ర వేసింది. శ్రీదివ్యది చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. వివేక్ నవ్వించాడు. మిగతా వాళ్లంతా పర్వాలేదు.

సాంకేతికవర్గం:

‘కాష్మోరా’ కోసం సాంకేతిక నిపుణులు బాగానే కష్టపడ్డారు. సంతోష్ నారాయణన్ సంగీతం ఇంతకుముందు ఇలాంటి జానర్లలో చూసిన సినిమాలతో పోలిస్తే భిన్నంగా అనిపిస్తుంది. పాటల్లో ఓయా.. ఓయా.. మినహా ఏవీ ఆకట్టుకోవు. పాటలు సినిమాకు మైనస్. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బలంగా నిలిచింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆర్ఆర్ అదిరిపోయింది. కొంచెం వెస్ట్రన్ టచ్ ఎక్కువవడం అక్కడక్కడా ఇబ్బందిగా అనిపించినా.. ఓవరాల్ గా సంతోష్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచింది. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ కృషి అడుగడుగునా కనిపిస్తుంది. సెట్టింగ్స్ అద్భుతంగా కుదిరాయి. ఫ్లాష్ బ్యాక్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల మాత్రం కృత్రిమంగా అనిపిస్తాయి. అవసరం లేకున్నా కొన్ని చోట్ల వీఎఫెక్స్ జోడించారు. సినిమా పరిధికి మించి బాగానే ఖర్చు పెట్టింది పీవీపీ సంస్థ. దర్శకుడు గోకుల్ విషయానికి వస్తే.. ‘కాష్మోరా’ విషయంలో అతడికి క్లారిటీ మిస్సయిందేమో అనిపిస్తుంది. చాలా విషయాలు చెప్పాలని.. మూడు రకాల జానర్లను మిక్స్ చేసి కలగాపులగం చేశాడు. కామెడీ పండించడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది కానీ.. ‘కాష్మోరా’ లాంటి కథను పకడ్బందీ కథనంతో కన్విన్సింగ్ గా చెప్పడంలో మాత్రం అతను విజయవంతం కాలేకపోయాడు.

చివరగా: కాష్మోరా.. కలగాపులగం!

రేటింగ్: 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre