Begin typing your search above and press return to search.

శివను హిప్పీగా మార్చారే!!

By:  Tupaki Desk   |   20 Sep 2018 11:14 AM GMT
శివను హిప్పీగా మార్చారే!!
X
అసలు ఏ మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆరెక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. కోలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాత కలైపులి థాను నిర్మించబోయే ఈ చిత్రానికి హిప్పీ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఒకప్పుడు 80-90 దశకాల్లో ఈ హిప్పీ కల్చర్ ఎక్కువగా ఉండేది. విచ్చలవిడి సంస్కృతికి అలవాటు పడిన యువతీయువకులను ఒక సమూహంగా ఈ పేరుతో పిలిచే వారు. డ్రగ్స్ కు బాగా అలవాటు పడిన ఇలాంటి బ్యాచీలు గోవాలో ఎక్కువగా కనపడేవి. తర్వాత ఇదంతా కనుమరుగైపోయింది. స్మగ్లింగ్ తగ్గిపోయి తాగడం ఒక మాములు అలవాటుగా మారిపోయిన తరుణంలో హిప్పీ అనే మాట విన్పించడం మానేసింది. మళ్ళి ఇన్నాళ్లకు దర్శకుడు టిఎన్ కృష్ణ కార్తికేయ కోసం ఈ పేరు ని తీసుకొచ్చాడు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆరెక్స్ 100లో భగ్న ప్రేమికుడైన శివగా మెప్పించిన కార్తికేయకు ఇది మూడో సినిమా.

ఇది కాకుండా మరో పెద్ద బ్యానర్ లో డైరెక్టర్ గా డెబ్యూ చేయబోయే ఓ రైటర్ తో కార్తికేయ తన నాలుగో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా విభిన్నమైన కాన్సెప్ట్స్ తో ముందుకు వెళ్తానని చెప్పిన కార్తికేయ దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు. ఆరెక్స్ 100 ఇమేజ్ మాయలో పడిపోకుండా సరైన దారిలో వెళ్తున్నట్టే కనిపిస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. పేర్లు ఇంకా రివీల్ చేయలేదు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో రూపొందే హిప్పీని డబ్బింగ్ గా కాకుండా ద్విభాషా చిత్రంగా రూపొందించబోతున్నారు. స్పైడర్-నోటా తర్వాత అలా తీస్తున్న మూవీ హిప్పీనే. థాను లాంటి అగ్ర నిర్మాతతో ప్రాజెక్ట్ ఓకే కావడం పట్ల కార్తికేయ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.