అన్నయ్యపై కంప్లయింట్ చేస్తా:కార్తి

Wed Jul 11 2018 15:19:38 GMT+0530 (IST)

`ఖాకీ` సినిమాతో హిట్ కొట్టిన తమిళ స్టార్ హీరో కార్తి` చినబాబు`తో జులై 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో రైతులు - బంధుత్వాలు - కుటుంబ విలువలు వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన కార్తి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నెలకు లక్ష సంపాదిస్తూ....అక్కలకు - అక్క కూతుళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండే పాత్ర నాది అని కార్తి తెలిపారు. రైతులకు సంబంధించిన డైలాగ్స్ ...ట్రైలర్ లో ఉన్నాయి కాబట్టి...ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన సినిమా అనుకోవద్దని - ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన సినిమా కార్తి అన్నారు. రైతులకు సంబంధించిన విషయాలు సినిమాలో చర్చించాం. రైతు విలువ - గౌరవం గురించి చెప్పాం. కేవలం రైతుల ఆత్మహత్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నామని....కానీ పది మందికి అన్నం పెట్టే రైతు గురించి గర్వంగా మాట్లాడాలని ....కార్తీ అన్నారు. అందుకే - లాయర్లు - డాక్టర్లు - జర్నలిస్టులు బైక్ లు - కార్ల పై స్టిక్కర్లు అంటించుకున్నట్లు....తన బైక్ పై `ఫార్మర్` అని స్టిక్కర్ ఉంటుందని కార్తి అన్నారు.`ఖాకీ` సినిమా అర్థం చేసుకోవడానికి కొంతమంది ఇబ్బందిపడ్డారని - కానీ ఈ సినిమా....చిన్న పిల్లవాడి దగ్గరి నుంచి పెద్దవారి వరకు అందరికీ అర్థం అవుతుందని అన్నారు. తెలుగు - తమిళ ప్రజల సంస్కృతి దాదాపు ఒకేలా ఉంటుందని వ్యవసాయం కామన్ అని కార్తి అన్నారు. ఈ సినిమాలో గోదావరి యాస ట్రై చేశానని - బంధువులతో తమను కంపేర్ చేసుకుంటూ అందరూ కనెక్ట్ అవుతారన్నారు. అన్నయ్య సూర్య ఈ సినిమా నిర్మాత కాబట్టి ఎక్కువ బాధ్యతగా చేశానని - సినిమా ఎలా ఉందో  ప్రజలు నిర్ణయిస్తారని అన్నయ్య అన్నారని కార్తి చెప్పారు. తమ పెదనాన్న రైతు అని - తాము డబ్బులిచ్చి వ్యవసాయం చేయిస్తున్నామన్నారు. తన భార్య ఓ రైతు కూతురని - సెలవుల్లో తమ ఫ్యామిలీ పల్లెటూరిలో గడుపుతామని అన్నారు. తన అన్నయ్య ఇంకా ఈ సినిమా రెమ్యున్ రేషన్ ఇవ్వలేదని - సినిమా ఆడిన తర్వాత ఇస్తానని చెప్పాడని అన్నారు. ఒక వేళ డబ్బులివ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో కంప్లయింట్ చేస్తానని చమత్కరించారు. సూర్య నిర్మాతగా పాండిరాజ్ తెరకెక్కించిన "చినబాబు``.లో కార్తి సరసన సయేషా హీరోయిన్ గా నటిస్తోంది.