హైదరాబాద్ కు చేరిన పద్మావత్ నిరసన సెగ

Sun Jan 21 2018 22:19:32 GMT+0530 (IST)

అనేక ఆటంకాల మధ్య విడుదలకు సిద్ధమయిన ‘పద్మావత్’ సినిమాకు నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమా విడుదల కోసం చిత్ర నిర్మాణ సంస్థ వయాకం 18 సుప్రీంకోర్టును ఆశ్రయించగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో నిర్మాతలు సినిమా విడుదల కోసం సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకోగా...తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది.ఈ నెల 25న పద్మావత్ సినిమా విడుదలను నిరసిస్తూ సాగుతున్న వ్యతిరేక సెగ హైదరాబాద్ కు తాకింది. సికింద్రాబాద్ లోని టివోలి ఎక్స్ ట్రీమ్ సినిమా ధియేటర్లో ఈ సినిమా ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలువురు యువకులు థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. సినిమా పోస్టర్లను  యువకులు చింపివేశారు. దాదాపు 35 మంది మార్వాడీ యువకులు వచ్చి పోస్టర్స్ ను చింపివేశారని థియేటర్ యాజమాన్యం తెలిపింది. పోలీసుల రాకతో జై మార్వాడీ - బన్సాలి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ యువకులు వెళ్లిపోయినట్లు వివరించారు.

కాగా గుజరాత్ లో రాజ్  పుత్ లు గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (జీఎస్ ఆర్టీసీ) బస్సుల లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఉత్తర గుజరాత్‌లోని మెహసానా - పటాన్ - గాంధీనగర్ - సబర్ కంఠ - బనస్ కంఠ జిల్లాలకు అహ్మదాబాద్ నుంచి బస్సులను నిలిపివేస్తున్నట్టు జీఎస్ ఆర్టీసీ కార్యదర్శి కేడీ దేశాయ్ ప్రకటించారు. శనివారం రాత్రి మెహసానా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బస్సులపై రాజ్ పుత్ లు ద్విచక్రవాహనాలపై వచ్చి పెట్రో బాంబులతో విసిరేశారని వివరించారు. ఈ దాడిలో ఆరు బస్సుల అద్దాలు పగిలినట్టు తెలిపారు. దీంతోపాటు అహ్మదాబాద్‌లో ఓ థియేటర్ కౌంటర్ పై దుండగులు దాడిచేసినట్టు తెలుస్తున్నది. మరోవైపు సినిమా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశంలోని కొన్నిచోట్ల సినిమా థియేటర్లలో దాడులు జరిగే అవకాశం ఉన్నదని.. దుండగులు ప్రేక్షకులతో వచ్చి దాడులు చేయొచ్చని సినిమా యజమానులు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నితిన్ దార్ తెలిపారు. ఆందోళనకారులు ఏ విధంగా వచ్చి దాడి చేస్తారో తెలియనందున.. సినిమా స్క్రీన్ - థియేటర్ లో విలువైన వస్తువుల కోసం ఎగ్జిబిటర్లు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి - రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్టు ఆయన వివరించారు.

మరోవైపు  సీనియర్ సంగీత దర్శకుడు పండిత్ విశ్వమోహన్ ‘పద్మావత్’ సినిమాకు మద్దతు తెలిపారు. దేశ సంస్కృతి.. ముఖ్యంగా రాజస్థాన్ ఆచార - వ్యవహారాలను సినిమాలో చూపిస్తున్నందున ‘పద్మావత్’కు రాష్ట్రంలో పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.