Begin typing your search above and press return to search.

అతను పట్టిందల్లా బంగారమే..

By:  Tupaki Desk   |   2 Jan 2019 1:30 AM GMT
అతను పట్టిందల్లా బంగారమే..
X
‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో బాలీవుడ్లోకి దూసుకొచ్చిన దర్శకుడు కరణ్ జోహార్. ఆ తర్వాత కూడా దర్శకుడిగా కొన్ని మంచి సినిమాలు అందించాడు. ఐతే ఈ మధ్య దర్శకుడిగా కరణ్ సినిమాలు బాగా తగ్గించేసి నిర్మాతగా బిజీ అయిపోయాడు. కరణ్ చాలా తెలివైన నిర్మాత అని.. ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాల ఫలితాల్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది. సొంతంగా నిర్మించినా.. వేరొకరి సినిమాను తన బేనర్ ద్వారా రిలీజ్ చేసినా అది దాదాపు సక్సెస్ కావాల్సిందే. కరణ్ బేనర్ నుంచి వచ్చినవాటిలో అసలివి ఆడుతాయా అని సందేహాలు ఉన్న చిత్రాలు సైతం సంచలన విజయాలు సాధించిన రికార్డుంది. ‘బాహుబలి’ హిందీలో బాగా ఆడగలదని నమ్మడమే కరణ్ సక్సెస్ సీక్రెట్. ఆ సినిమా అతడికి కాసుల వర్షం కురిపించింది.

దీని తర్వాత ‘2.0’ను టేకప్ చేశాడు కరణ్. ఐతే ఈ చిత్రం చాలా నెగెటివిటీ మధ్య రిలీజైంది. తమిళ.. తెలుగు భాషల్లో ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టలేదు. ఇక్కడ ఆ చిత్రాన్ని ఫ్లాప్ అనే చెప్పాలి. కానీ హిందీలో మాత్రం ఇది సూపర్ హిట్టే. రూ.100 కోట్లకు హక్కులు తీసుకుంటే.. 200 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇక ఏడాది చివర్లో కరణ్ నుంచి ‘సింబా’ సినిమా వచ్చింది. ఈ చిత్రంపై అనేక సందేహాలు నెలకొన్నాయి విడుదలకు ముందు. ‘టెంపర్’ ఫ్లేవర్ మొత్తం మిస్ అయిందని.. ఈ సినిమా ఆడటం కష్టమే అని అన్నారు. కానీ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయాయి. 2018ని ఒక బ్లాక్ బస్టర్ తో ముగించాడు కరణ్. గత ఏడాది కరణ్ బేనర్ నుంచి వచ్చిన ‘రాజి’.. ‘ధడక్’ సినిమాలు కూడా బాగా ఆడాయి. సూపర్ హిట్లుగా నిలిచాయి. అతను నిర్మించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ కూడా హిట్టే. మొత్తానికి కరణ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుంది కథ.