కరణ్ జోహార్ కు బల్బు వెలిగింది

Sun Dec 10 2017 16:46:51 GMT+0530 (IST)

బాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్లలో కరణ్ జోహార్ ఒకడు. కరణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చాలా వరకు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. కానీ అతను ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ ఈ కోవలోకి రావు. ‘దోస్తానా’ లాంటి సినిమాలు ఎంత బూతులతో నిండిపోయి ఉంటాయో తెలిసిందే. ఐతే కరణ్ ఇప్పుడు ఉన్నట్లుండి ఫెమినిస్టు అవతారం ఎత్తేశాడు. సినిమాల్లో మహిళల్ని అసభ్యంగా చూపించడం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు.‘‘సినిమాల్లో.. టీవీ షోల్లో మహిళల్ని అసభ్యంగా చూపించే ధోరణి పెరిగిపోతుండటం బాధాకరం. ఐటైం సాంగ్స్ లో అమ్మాయిలతో మితిమీరిన అందాల ప్రదర్శన చేయిస్తున్నారు. ఇది ఇబ్బందిగా అనిపిస్తోంది’’ అని కరణ్ జోహార్ అన్నాడు. ఐతే తన సినిమాలేమీ క్లీన్ అని తాను భావించట్లేదని.. ఆ సినిమాల్లో కూడా ఇలాంటి పాటలు పెట్టానని.. అందుకు ఇప్పుడు చింతిస్తున్నానని.. ఇకపై మాత్రం తన సినిమాల్లో అలాంటి పాటలు.. అమ్మాయిలతో అతిగా ఎక్స్ పోజింగ్ చేయించడాలు లేకుండా చూసుకుంటానని కరణ్ అన్నాడు.

చివరగా తన దర్శకత్వంలో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాను రూపొందించిన కరణ్.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలేమీ చేయట్లేదు. నిర్మాతగా మాత్రం ఒకటికి నాలుగు సినిమాలు నిర్మిస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఎంత ‘క్లీన్’గా ఉంటాయో.. హీరోయిన్లను ఎంత పద్ధతిగా చూపిస్తాడో చూడాలి.