అక్కడ అర్జున్ రెడ్డి అతనే

Thu Sep 14 2017 12:36:40 GMT+0530 (IST)

ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదగాలంటే చేసిన ప్రతి సినిమాకి మార్కెట్ ను కొంచెం కొంచెంగా పెంచుకుంటూ రావాలి. కానీ ఈ తరం కుర్ర హీరోలు అలా కాదు కొడితే బాక్స్ ఆఫీసునే బద్దలు కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. అసలెన్ని రోజులు ఈ సైడ్ క్యారెక్టర్లు.. కాఫీలాంటి సినిమాలు చేస్తూ.. ఉండడం అని ఒక్కసారిగా చిర్రెత్తిపోయి అందరికి పిచ్చెక్కించేలా ఒక సినిమాను తియ్యాలని అనుకున్నాడేమో తెలియదు గాని అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ నిజంగానే దిమ్మ తిరిగేలా చేశాడు.

ఒక చిన్న సినిమా 40 కోట్లను దాటించిందంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత రోజుల్లో గంటన్నర సినిమాకే చిర్రెత్తిపోయే ప్రేక్షకులు కన్నార్పకుండా మూడుగంటల పాటు అర్జున్ రెడ్డి లవ్ స్టోరీని అలాగే తెరపై చూశారు. అయితే ఆ సినిమాపై ఇప్పుడు పరభాషా నటులు కూడా మనస్సు పారేసుకుంటున్నారు. సినిమా వినూత్నంగా ఉందని తమిళ హక్కులను మొదట కొనేసుకున్నాడు హీరో ధనుష్. కానీ ఆ సినిమాలో తాను నటిస్తాననే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ స్పెషల్ వేసుకొని మరి సినిమా చూసి సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు అదే తరహాలో కన్నడలో కూడా అర్జున్ రెడ్డి హావా  మొదలవ్వనుందని తెలుస్తోంది.

కన్నడ హక్కులను ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సొంతం చేసుకున్నారట. అలాగే అర్జున్ రెడ్డి పాత్రకు కన్నడ యువ హీరో యష్ ని కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. కన్నడలో ఈ యువ హీరో ఇలాంటి పాత్రలు చక్కగా చేస్తాడని మంచి గుర్తింపు ఉంది. దీంతో నిర్మాత వెంకటేష్ ఒక యువ దర్శకుడితో కన్నడ అర్జున్ రెడ్డిని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారట. మరి తెలుగులో భారీ విజయం అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా పరభాష ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.