Begin typing your search above and press return to search.

మళ్లీ పెళ్లి.. తప్పేంటంటున్న హాటీ

By:  Tupaki Desk   |   26 July 2016 4:18 AM GMT
మళ్లీ పెళ్లి.. తప్పేంటంటున్న హాటీ
X
సినిమా వాళ్లంటే హిపోక్రసీ ఎక్కువ. లోపల ఉద్దేశాలు ఒకలా ఉంటాయి. పైకి ఇంకోలా మాట్లాడుతుంటారు. ముఖానికే కాదు.. మాటలకు కూడా మేకప్ వేస్తారు సినిమా వాళ్లు అంటుంటారు. ఐతే కంగనా రనౌత్ మాత్రం ఆ టైపు కాదు. ‘ఇడియట్’ సినిమాలో రవితేజ లాగా బుర్రలో ఏమనిపిస్తే నోటితో అదే మాట్లాడేస్తుంది. ఓపెన్ గా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. సహజీవనం గురించి.. పెళ్లి గురించి ఆమె గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ సంచలనం రేపాయి. తాజాగా రెండో పెళ్లి చేసుకునే విషయంలోనూ ఆమె తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఒక పెళ్లి కూడా చేసుకోని కంగనా రెండో పెళ్లి గురించి మాట్లాడింది. ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చని.. తన పెళ్లి ఫెయిలైతే రెండో పెళ్లి చేసుకునే విషయంలో వెనుకంజ వేయనని కంగనా చెప్పింది.

‘‘ఒకసారి పెళ్లి చేసుకోగలిగినపుడు.. ఆ తర్వాత ఎన్నిసార్లయినా చేసుకోవచ్చు. ఒక పెళ్లి విఫలమైందంటే కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇంకొకరిని భాగస్వామిగా ఎంచుకోవచ్చు. అందులో తప్పేముంది’’ అని ప్రశ్నించింది కంగనా. ఇక తన పెళ్లి ఎప్పుడో కానీ.. అది చాలా గ్రాండ్ గా చేసుకోవాలన్నది తన కోరిక అని కంగనా చెప్పింది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అందరు భారతీయ అమ్మాయిల్లాగే తయారవ్వాలనుకుంటున్నానని.. తన డిజైనర్ ఫ్రెండ్ మానవ్ గంగ్వాని డిజైన్ చేసిన దుస్తులే ధరిస్తానని ఆమె వెల్లడించింది. ఇప్పటికే తన పెళ్లి డ్రెస్ డిజైనింగ్ గురించి మానవ్ తో డిస్కస్ చేసినట్లు ఆమె చెప్పింది. ఇంతకీ తన పెళ్లి ఎప్పుడన్నది మాత్రం వెల్లడించలేదు కంగనా.