Begin typing your search above and press return to search.

మరో సెన్సేషనల్ క్యారెక్టర్లో కంగన

By:  Tupaki Desk   |   3 Sep 2015 2:05 PM GMT
మరో సెన్సేషనల్ క్యారెక్టర్లో కంగన
X
దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు భారీగా పారితోషకమైతే పుచ్చుకోవచ్చు కానీ.. చేస్తున్న క్యారెక్టర్లు, వస్తున్న గుర్తింపు ప్రకారం చూస్తే కంగనా రనౌతే బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్. క్వీన్, రివాల్వర్ రాణి, తను వెడ్స్ మను లాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ రింగుల జుట్టు సుందరి. ప్రస్తుతం బాలీవుడ్ ఓ ఛాలెంజింగ్ లేడీ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే.. అందరికీ కంగనానే గుర్తుకొస్తోంది. ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించిన ‘కట్టీ బట్టీ’తో పాటు, విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో చేయబోతున్న ‘రంగూన్’లోనూ భిన్నమైన, ఛాలెంజింగ్ రోల్సే చేస్తోంది కంగన. ఇప్పుడు ఆమె చెంతకు మరో సెన్సేషనల్ క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ సంగతులేంటో చూద్దాం పదండి.

అమెరికాలో భారీ స్థాయిలో బ్యాంకుల్ని లూటీ చేసిన సందీప్ కౌర్ అనే నర్సు గురించి పత్రికల్లో చదివే ఉంటారు. 25 ఏళ్ల సందీప్ కౌర్ మద్యానికి, జూదానికి బానిసై డబ్బు కోసం బ్యాంకుల్ని దోచుకోవడం మొదలుపెట్టింది. అమెరికాలో మూడు రాష్ట్రాల్లోని బ్యాంకు అధికారుల్ని బురిడీ కొట్టించి భారీ మొత్తంలో దోపిడీ చేసింది. మారువేషాల్లో మోసం చేయడంలో ఆమె టాలెంట్ చూసి.. ‘బాంబే షెల్ బ్యాండిట్’ అనే పేరుతో పిలిచేవారామెను. ఐతే గత ఏడాది జులైలో అమెరికా పోలీసులు ఆమెను వెంటాడి పట్టుకుని ఈ కథకు ముగింపు పలికారు. ఇప్పుడు సందీప్ కథతో దర్శకుడు హన్సల్ మెహతా ‘సిమ్రన్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సందీప్ కౌర్ పాత్రకు కంగనను అడగ్గా.. ఆమె చాలా ఎగ్జైటై ఓకే చెప్పేసిందట. ఇలాంటి నిజజీవిత పాత్రల్లో నటించమంటే కంగన రెచ్చిపోతుంది. ఇంతకుముందు ‘ఫ్యాషన్’ సినిమాలో ఓ నిజజీవిత మోడల్ పాత్రలో అదరగొట్టేసింది కంగన. ఇప్పుడు సందీప్ కౌర్ పాత్రలోనూ అలాగే జీవించేయడానికి సిద్ధమవుతోంది.