Begin typing your search above and press return to search.

మూవీ మాఫియా అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Jun 2019 1:30 AM GMT
మూవీ మాఫియా అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు
X
'హీరోయిన్లందు కంగనా రనౌత్ వేరయా.. అందుకే ఆమెను బాలీవుడ్ క్వీన్ అంటారయ్యా' అని మనం అనుకోవాల్సిందే. లౌక్యం.. ముఖప్రీతీ.. షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడడం.. ఇలాంటి వాటికి కంగనా కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అవకాశం వస్తే చాలు ఏ టాపిక్ పైన అయినా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. ఎవరిపైనా విమర్శలు చేయాల్సి వచ్చినా తడుముకోకుండా దాడిచేస్తుంది. అందుకే కంగనా జోలికి పోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు బాలీవుడ్ ప్రముఖులు. తాజాగా కంగనా మరోసారి తన స్టైల్ లో చెలరేగిపోయింది.

కంగనా ఏ సందర్భంగా తన విశ్వరూపం చూపించింది అని మీకు అనుమానం వచ్చిందా?.. ఇంతకీ ఏం జరిగిందంటే తాజాగా బుచియన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ కు భారతదేశం నుండి నాలుగు సినిమాలు ఎంపికయ్యాయి. బుచియనా.. ఇదేదో వింతగా ఉంది.. మేమెప్పుడూ వినలేదే అని చచ్చుపుచ్చు అభిప్రాయాలను మీరు వ్యక్తం చేయవద్దు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో బ్లూ సెక్షన్ కింద 'గల్లీ బాయ్'.. 'అంధా ధున్'.. 'మణికర్ణిక'.. 'సూపర్ డీలక్స్' చిత్రాలను ఎంపిక చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సి' కి ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. పనిలో పనిగా తనను వ్యతిరేకులపై సెటైర్లు వేసింది.

"బుచియన్ ఫెస్టివల్ కు 'మణికర్ణిక' ఎంపిక కావడం మమ్మల్ని థ్రిల్ చేసింది. 'గల్లీబాయ్‌' పై బాలీవుడ్ అంతా ప్రశంసల జల్లు కురిపించింది కానీ 'మణికర్ణిక' గురించి మాత్రం మాట్లాడకుండా ఊరుకున్నారు. మూవీ మాఫియా మా 'మణికర్ణిక' ను చంపేయాలని అనుకుంది. కానీ మా సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. అంతే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా లభించింది. ఇది మూవీ మాఫియాకు చెంపపెట్టు లాంటిది. వాళ్లందరూ కలిసి ఎంత ప్రయత్నించినా ఒక మంచి సినిమాను అడ్డుకోలేరు. సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ జెనరేషన్లో వారి పప్పులు ఉడకవు" అని వ్యాఖ్యానించింది.

ఇక కంగనా 'తాన' అంటే చాలు 'తందాన తానే తందనాన' అంటూ బుర్రకథ స్టైల్ లో పాడే ఆమె సోదరి రంగోలి ఈసారి పెద్దగా రియాక్ట్ కాలేదు. ట్విట్టర్ ద్వారా "మణికర్ణిక విల్ లివ్ ఆన్" అంటూ ఒక నమస్కారం ఎమోజిని జోడించింది.