సోషల్ మీడియాపై కంగన మార్కు విసుర్లు

Tue Apr 17 2018 18:24:13 GMT+0530 (IST)

ఈ రోజుల్లో సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సెలబ్రెటీలు అరుదు. సోషల్ మీడియాను తిట్టేవాళ్లు కూడా అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా మీద అలిగి అకౌంట్లు డెలీట్ చేసిన వాళ్లు కూడా కొంచెం గ్యాప్ తర్వాత ఏదో కోల్పోతున్నట్లు ఫీలై మళ్లీ అక్కడికే వస్తుంటారు. కానీ బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం ఇప్పటిదాకా సోషల్ మీడియాలోకి అడుగే పెట్టలేదు. ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్.. ఇలా వేటిలోనూ ఆమెకు అకౌంట్ లేదు. తాను ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టలేదని... ఇక పైనా అందులోకి వచ్చే అవకాశమే లేదని ఆమె తెగేసి చెప్పడం విశేషం.సోషల్ మీడియాలోకి వస్తే ఉన్నదున్నట్లు..నిజాలు మాట్లాడలేమని.. ఇది తన మనస్తత్వానికి తగిన వేదిక కాదని కంగనా అంటోంది. ఇక్కడ హిపోక్రసీ ఎక్కువ అని.. నిజాయితీగా ఉండటం కష్టమని.. అందుకే ఇందులోకి తాను రాలేనని చెప్పింది. అలాగే సోషల్ మీడియా వల్ల చాలా సమయం కూడా వృథా అవుతుందని.. తాను దానికి దూరంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పింది. కేవలం తాను అకౌంట్ తెరిస్తే చాలని.. మిగతాది తాము మేనేజ్ చేస్తామని.. తన తరఫున పోస్టులు కూడా పెడతామని.. దీన్ని బ్రాండింగ్ కోసం వాడుకోవచ్చిన కొన్ని సంస్థలు తనను సంప్రదించాయని.. కానీ తన ప్రమేయం లేకుండా అకౌంట్ నడవడం ఇష్టం లేక తాను అందుకు నో చెప్పానని కంగనా తేల్చి చెప్పింది. ఏ విషయంపైన అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగనా.. సోషల్ మీడియా విషయంలోనూ తనదైన శైలిలో స్పందించింది.