క్రెడిట్ అంతా కంగనాకేనా..?

Thu Jan 24 2019 14:44:28 GMT+0530 (IST)

'మణికర్ణిక' సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది.  కానీ కొంతభాగం షూటింగ్ మిగిలి ఉండగానే క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న కంగనానే ఆ బాధ్యతలు చేపట్టింది.   కంగనా ఎంట్రీతో కొన్ని మార్పులు జరిగాయి.  ఆ తర్వాత సినిమాకు 30% భాగానికి కంగనా దర్శకత్వం వహించి సినిమాను పూర్తి చేసింది.రేపు శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతోంది.  కారణాలు తెలీదుగానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా క్రిష్ కనిపించడం లేదు.  అప్పుడెప్పుడో హైదరాబాద్ లో జరిగిన తెలుగు వెర్షన్ ట్రైలర్ లాంచ్ కు మాత్రం క్రిష్ హాజరయ్యాడు. ఆ తర్వాత ఈ సినిమాకు దూరంగా ఉన్నాడు. మరోవైపు 'మణికర్ణిక' ప్రమోషన్స్ లో కంగనా తన జోరు చూపిస్తోంది.  అసలు అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.  రీసెంట్ గా ముంబైలో సెలబ్రిటీల కోసం ప్రీమియర్లు ప్రదర్శించినపుడు ప్రశంసలన్నీ కంగనాకే వస్తున్నాయట.  తాను తీసింది 30%.. కానీ క్రెడిట్ మాత్రం 70% అన్నట్టుగా ఉంది.  

ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం 100% క్రెడిట్ తీసుకున్నా ఆశ్చర్యపడవలసిన పనేలేదని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.  హిట్ అయితే సరే. ఒకవేళ ఫలితం అటూ ఇటూ అయితే అప్పుడు నెపం క్రిష్  మీదకు నెట్టకుండా కంగనానే బాధ్యత తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి.  ఒకటి మాత్రం నిజం.. క్రిష్ ఈ సినిమాను మెజారిటీ భాగం పూర్తి చేసికూడా సంబంధం లేనట్టు దూరంగా ఉండడం క్రిష్ అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టే అంశమే.