Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'కాంఛన-3'

By:  Tupaki Desk   |   19 April 2019 1:40 PM GMT
మూవీ రివ్యూ: కాంఛన-3
X
చిత్రం : 'కాంఛన-3'

నటీనటులు: రాఘవ లారెన్స్ - వేదిక - ఒవియా - నిక్కీ తంబోలి - కోవై సరళ - సత్యరాజ్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెట్రి
నిర్మాత: కళానిధి మారన్
రచన - దర్శకత్వం: రాఘవ లారెన్స్

దక్షిణాదిన హార్రర్ కామెడీ జానర్ కు మంచి ఊపు తెచ్చిన చిత్రాల్లో ‘కాంఛన’ సిరీస్ ను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ ఫ్రాంఛైజీతో పెద్ద హిట్లు కొట్టిన రాఘవ లారెన్స్.. ఇప్పుడు ‘కాంఛన-3’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతను మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టి.. నవ్వించాడా.. చూద్దాం పదండి.

కథ:

రాఘవ (రాఘవ లారెన్స్) దయ్యాలంటే తెగ భయపడిపోయే కుర్రాడు. అతడిని ఒకటికి రెండు దయ్యాలు పట్టి పీడిస్తాయి. అందులో ఒక దయ్యం కాళి (లారెన్స్).. ఇంకో దయ్యం అతడి ప్రేయసి లూసీ. వీళ్లిద్దరూ రాఘవను ఆవహించడానికి కారణం ఉంటుంది. వాళ్లిద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయి.. తమ మరణానికి కారణమైన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇంతకీ వాళ్లను చంపిందెవరు? రాఘవ ద్వారా ఆ వ్యక్తిపై వీళ్లిద్దరూ ప్రతీకారం తీర్చుకున్నారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

రాఘవ లారెన్స్ తీసిన ‘కాంఛన’ సిరీస్ సినిమాల్లో అయినా.. మిగతా హార్రర్ కామెడీల్లో అయినా దాదాపుగా ఒకే కథ కనిపిస్తుంది. ఒక విలన్ చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి లేదా వ్యక్తులు.. దయ్యంగా మారి మరో వ్యక్తిలో ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారు. ఐతే ఒక దశ వరకు ఇవే కథల్ని తిప్పి తిప్పి తీస్తున్నా ప్రేక్షకులు సర్దుకుపోయారు కానీ.. తర్వాత మొహం మొత్తేసింది. చూసిన సినిమాల్నే మళ్లీ చూసే ఓపిక లేక తిప్పి కొట్టడం మొదలుపెట్టారు. ఐతే హార్రర్ కామెడీ ఔట్ డేటెడ్ అనుకున్న రోజుల్లో కూడా లారెన్స్ ‘గంగ’ సినిమాతో మెప్పించగలిగాడు. కథ ఒకే రకంగా ఉన్నా తనదైన శైలిలో కామెడీ పండించడం.. భయపెట్టడం ద్వారా అతను ప్రేక్షకుల్ని మెప్పించగలిగాడు. దీంతో పాటుగా ‘కాంఛన’.. ‘గంగ’ సినిమాల్లో హృద్యంగా సాగే ఫ్లాష్ బ్యాక్స్ కూడా వాటికి ప్లస్ అయ్యాయి. కానీ ‘కాంఛన-3’కు వచ్చేసరికి కామెడీ.. హార్రర్ రెండూ కూడా అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. ముందు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఒకే రకం సినిమాలు తీసి తీసి లారెన్స్ లో ఐడియాలు అడుగంటిపోయాయేమో అనిపిస్తుంది ‘కాంఛన-3’ చూస్తుంటే.

దయ్యాలంటే భయపడిపోయే లారెన్స్ కే దయ్యం పడితే ఎలా ఉంటుందో ఇప్పటికే మూడు సినిమాల్లో చూశాం. ఆ పాత్ర ద్వారా ఎంత కామెడీ పండించొచ్చో అంతా పండించేశాడు లారెన్స్. ఇక కొత్తగా చేసేదేముంది? ఇక లారెన్స్ తల్లిగా కోవై సరళ పాత్ర గురించి చెప్పేదేముంది? వీళ్లిద్దరూ కలిసి చేసి లౌడ్ కామెడీ మరీ రొటీన్ గా ఉండి చాలా చోట్ల విసుగెత్తిస్తుంది. లారెన్స్ అంటేనే లౌడ్ కామెడీకి పెట్టింది పేరు. పైగా ‘కాంఛన’ సిరీస్ దీని వల్లే సక్సెస్ అవుతోందనే బలంగా నమ్మే లారెన్స్ ఈసారి లౌడ్ నెస్ మరీ పెంచేశాడు. దీనికి తోడు అడుగడుగునా అరవ అతి డామినేట్ చేస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లలో సగటు తెలుగు ప్రేక్షకుల అభిరుచి బాగా మారి.. సెన్సిబుల్ సినిమాలకు అలవాటు పడ్డ నేపథ్యంలో ‘కాంఛన-3’ మరీ గోల గోలగా ఉండి ఫ్రస్టేట్ చేస్తుంది. ప్రథమార్ధం అంతా కూడా గతంలో చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్ చేస్తున్నట్లగా అనిపిస్తుంది. థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్.. కెమెరా పనితనం వల్ల ప్రేక్షకులకు భయం పుట్టొచ్చు కానీ.. హార్రర్ ఎలిమెంట్లోనూ కొత్తగా ఏమీ అనిపించదు. ఆ సమయానికి భయపడతాం. ఉలిక్కి పడతాం.. అంతే. ఇక ఒకరికి ముగ్గురు అమ్మాయిలతో లారెన్స్ చేసే రొమాన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సన్నివేశాలు మరీ అతిగా అనిపిస్తాయి.

ప్రథమార్ధమంతా కథ ఎక్కడా ముందుకు సాగినట్లు అనిపించదు. ద్వితీయార్ధంలో కాసేపటి తర్వాత కథలోకి ఇన్వాల్వ్ అవుతాం. ఇక అక్కడి నుంచి సినిమా చాలా సీరియస్ గా సాగిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గానే ఉన్నప్పటికీ.. కొంచెం ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఐతే ఏం జరగొచ్చనేది ముందే తెలిసిపోవడంతో ఫ్లాష్ బ్యాక్ ముగింపు కోసం ఎదురు చూస్తాం.

ఇక వర్తమానంలోకి వచ్చాక రివెంజ్ ట్రాక్ ఎలా ఉంటుందో కూడా అర్థమైపోతుంది. ఐతే సినిమా అంతటా కూడా మాస్ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తూనే సాగిపోయే ‘కాంఛన-3’ పతాక సన్నివేశం దగ్గరికి వచ్చేసరికి అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. క్లైమాక్సులో లారెన్స్ అతి పరాకాష్టకు చేరింది. ఆ గోలను.. భీభత్సాన్ని మామూలు ప్రేక్షకులు తట్టుకోవడం కష్టం. ఎండ్ టైటిల్స్ పడే వరకు కూర్చుంటే మామూలు స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. సినిమాపై అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను చాలా వరకు తగ్గించేస్తుంది పతాక సన్నివేశం. నిడివి బాగా ఎక్కువ కావడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే ‘కాంఛన’ సిరీస్ లో ఉండే రొటీన్ కథాకథనాలకు అలవాటు పడి.. లౌడ్ కామెడీని.. హార్రర్ ఎలిమెంట్ ను ఇష్టపడేవారికి ‘కాంఛన-3’ ఓకే అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ లోని గత సినిమాల మాదిరి మిగతా ప్రేక్షకుల్ని కదిలించే స్పెషల్ ఎలిమెంట్స్ అయితే ఇందులో లేవు. ఈ ఫ్రాంఛైజీలో వీక్ ఫిలిం ఇదే అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

రాఘవ లారెన్స్ ‘కాంఛన’ సిరీస్ లో రాఘవగా ఎప్పుడూ ఎలా కనిపిస్తాడో ఇందులోనూ అలాగే కనిపించాడు. దయ్యం పట్టాక అమ్మాయిలా ప్రవర్తించే సీన్లలో అతడి నటన బాగుంది కానీ.. అదేమీ కొత్త కాదు. కాళి పాత్రలో లారెన్స్ కొంచెం భిన్నంగా కనిపిస్తాడు. ఆ పాత్రలో అతడి నటన కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. హీరోయిన్లు వేదిక.. ఒవియా.. నిక్కీ.. గ్లామర్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. నటన మామూలే. కోవై సరళ తనకు అలవాటైన రీతిలో నటించింది. మాస్ ప్రేక్షకుల్ని ఆమె నటన ఆకట్టుకోవచ్చు. సత్యరాజ్ బాగానే చేశాడు.

సాంకేతికవర్గం:

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. నేపథ్య సంగీతంతోనే అతను చాలా చోట్ల భయపెట్టేశాడు. వెట్రి ఛాయాగ్రహణం కూడా సినిమాకు బాగానే ఉపయోగపడింది. హార్రర్ సన్నివేశాల్లో కెమెరా పనితనం కీలకమైంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక హార్రర్ కామెడీల్లో చేయి తిరిగిన రాఘవ లారెన్స్ చేయి తిరిగిన వంటకాన్నే మరోసారి వడ్డించాడు. కాకపోతే గత సినిమాల్లో మాదిరి ప్రేక్షకులు ఎమోషనల్ కనెక్టయ్యే అంశాలు ‘కాంఛన-3’లో లేకపోయాయి. మాస్ ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని మరీ లౌడ్ గా సినిమాను నడిపించడం.. ఎక్కడా కొత్తదనం కోసం ప్రయత్నించకపోవడంతో లారెన్స్ ఈసారి ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయలేకపోయాడు.

చివరగా: కాంఛన-3.. రొటీన్ బాదుడు

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre