Begin typing your search above and press return to search.

కమ్మ పాటకు పోటీగా కాపు పోస్టర్

By:  Tupaki Desk   |   24 Feb 2018 1:36 PM GMT
కమ్మ పాటకు పోటీగా కాపు పోస్టర్
X
మనిషి ఎంత అభివృద్ధి సాధించినా ఎన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొన్నా చంద్రమండలం కాదు అంతకు పైకి వెళ్లి ఒక రౌండ్ వేసొచ్చినా కొందరు మాత్రం ఇంకా కులాల చక్రంలోనే ప్రగతిని వెనక్కు తీసుకెళ్ళే ప్రయత్నం చూస్తే బాధ కలగడం సహజం. దీనికి సినిమా పరిశ్రమ కూడా అతీతం కాదు. కాకపోతే హీరో హీరొయిన్లు ఎవరైనా ఎంత పెద్ద స్థాయికి చేరినా వాటిని బయట పెట్టుకోవడం కాని కులం కార్డు గురించి చెప్పుకుని ప్రయోజనం పొందాలని కాని చేసిన దాఖలాలు చాలా తక్కువ. కాని అభిమానులు అలా కాదుగా. హీరోలకు కులాలు ఆపాదించి తమ వాడు గొప్పవాడు అంటే లేదు మా వాడే పోటుగాడు అంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం అనేది ఇప్పుడు ఎక్కువవుతోంది.

ఈ మధ్యే కమ్మ గీతం అంటూ యాంతం పేరిట ఒక పాట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆ జాతి గొప్పదనాన్ని పొగుడుతూ ఆ కులం నుంచి వృద్ధిలోకి వచ్చిన ప్రముఖులను ఉదాహరిస్తూ పెద్ద హంగామానే చేసారు. ఎవరిని వదలకుండా ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఆ కులం నుంచి వచ్చి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న వారిని హై లైట్ చేయటంతో ఇది కాస్త ఆ వర్గంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో మేమేం తక్కువ తిన్నామా అని కాపు వర్గం కూడా ఒక పోస్టర్ వదలటం ఇప్పుడు కొత్త సెన్సేషన్. అందులో ఎవరెవరు కాపు నుంచి వచ్చి సినిమాల్లో తమ ప్రతిభ చూపించి పేరు తెచ్చుకున్నారో వాళ్ళ ఫోటోలను మొత్తం అందులో ప్రచురించి దానికి కులం దిగ్గజాలు అని హెడ్డింగ్ కూడా పెట్టుకున్నారు.

ఇవన్ని చూసి ఆ హీరోలు నవ్వుకోవడం ఖాయం. తామే కులం లాంటివి పట్టించుకోకుండా తమ బిడ్డలకు కులాంతర మతాంతర వివాహాలు జరిపిస్తూ ఉంటే అవి చూసి కూడా కొందరు ఇలా ప్రవర్తించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ లేనిదే ఇక్కడ పైకి రావడం కష్టం. అది స్టార్ ఫ్యామిలీ హీరో అయినా కృష్ణ నగర్ లో అవకాశాల కోసం తిరిగే అప్ కమింగ్ హీరో అయినా అందరు ఒకటే. ఇలా కులం ప్రతిపాదికనే టాలెంట్ ఉండదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాపులకు ఒక గుడి, కమ్మలకో గుడి అంటూ దేవుళ్ళను కూడా పంచుకునే వారేమో. కొందరి అజ్ఞానం అందరికి చెడ్డ పేరు తీసుకురావడం మంచి పరిణామం కాదు.