మహానటిలో మా నాన్నకు అవమానం!

Thu May 17 2018 09:56:25 GMT+0530 (IST)

ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ అయి.. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు బెంచ్ మార్క్ గా మారుతుందని భావిస్తున్న మహానటి మూవీకి సంబంధించి కొత్త వివాదం ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ చిత్రంలో తన తండ్రిని చిత్రీకరించిన పద్దతిపై జెమినీ గణేశన్ కుమార్తె కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీఆర్.. శివాజీ గణేశన్ లతో పాటు తన తండ్రి జెమినీ గణేశన్ కూడా అగ్రహీరో అన్న విషయం అందరికి తెలుసన్నారు. తన తండ్రి పాత్రను సోమరిపోతుగా.. చిన్న పనులు చేసే వ్యక్తిగా కించపరిచారంటూ ఆరోపించారు. తాజాగా ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానటి మూవీని తప్పు పట్టారు.

సావిత్రికి మద్యం అలవాటు చేసింది తన తండ్రేనన్నట్లు సినిమా చూపించారన్నారు. ఇది తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నటులంతా ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదన్నట్లు చూపించటం సరికాదన్నారు.

ప్రాప్తం సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికి.. సావిత్రిని కలిసి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా చెప్పేందుకు తన తండ్రి సావిత్రి ఇంటికి వెళ్లారన్నారు. అప్పుడు తన తండ్రి వెంట తాను కూడా ఉన్నట్లు కమలా వెల్లడించారు. వాచ్ మెన్ చేత సావిత్రి తమను బయటకు నెట్టించారని.. ఆ తర్వాత తాము ఆ ఇంటి ఛాయలకు వెళ్లలేదన్నారు. మరి.. ఈ వివాదంపై సావిత్రి మరో కుమార్తె చాముండేశ్వరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.