Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ కదిలించేశాడు

By:  Tupaki Desk   |   20 March 2017 7:09 AM GMT
కమల్ హాసన్ కదిలించేశాడు
X
విలక్షణ నటుడు కమల్ హాసన్ కు గత ఏడాది కాలం నుంచి బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. గత ఏడాది ఆయన వదిన (చంద్ర హాసన్ భార్య) చనిపోయారు. ఆ తర్వాత ఆయన యాక్సిడెంట్లో కమల్ కాలు విరిగి ఆరు నెలలకు పైగా మంచానికి పరిమితం అయిపోయారు. ఇప్పుడు కమల్ అన్నయ్య చంద్రహాసన్ చనిపోయారు. ఈ సందర్భంగా కమల్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అందరూ కదిలిపోయేలా సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నాడు. తన అన్నయ్య మరణంపై కమల్ ఏమన్నాడంటే..

‘‘మా అన్నయ్యకు.. నాకు వయసులో 20 ఏళ్ల అంతరం ఉంది. ఆయన నాకు తండ్రి లాంటి వాడు. ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నా. ఆయనో స్వతంత్ర వ్యక్తి. చివరి రోజుల్లో కూడా తన బట్టలు తనే ఉతుక్కునేవారు. గత ఏడాది మా వదిన చనిపోయినపుడు ఆయన లోలోన కుంగిపోయారు మామూలుగా ఆయనస్సలు ఎమోషనల్ అవ్వరు. సినిమాల్లో ఎమోషనల్ సీన్లు వచ్చినపుడు కూడా ఆయనలో ఎలాంటి స్పందన ఉండదు. ఆయన తన జీవితంలో తొలిసారి.. చివరిసారి ఏడ్చింది మా వదిన చనిపోయినపుడే. నా ప్రొడక్షన్ హౌజ్ నడపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘విశ్వరూపం’ విడుదల ఆగిపోయినపుడు ఆందోళనకారులతో మాట్లాడి సర్ది చెప్పింది ఆయనే. మా వదిన చనిపోయాక ఆయన అమెరికాలోని తన కొడుకు దగ్గర కొన్నాళ్లు ఉన్నాడు. అక్కడికెళ్తే వాతావరణం మారుతుందని అనుకున్నారు. తర్వాత యూకేలో కూతురి దగ్గరికి వచ్చాడు. అక్కడే హార్ట్ అటాక్ వచ్చింది. యూకేలో చిన్న హార్ట్ అటాక్ అయినా సరే.. పోస్టుమార్టం తప్పనిసరి. ఆయన పార్థివ దేహం కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన అంత్యక్రియల సందర్భంగా మా ప్రైవసీని గౌరవించాలని మిత్రులు.. శ్రేయోభిలాషుల్ని కోరుతున్నా. మా అన్నయ్య సంపూర్ణ జీవితం అనుభవించారు. నేనూ ఆయనలా బతకాలనుకుంటున్నా’’ అని కమల్ పేర్కొన్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/