'ఇండియన్ 2' కోసం కమల్ పెద్ద సాహసం

Sun Oct 21 2018 20:00:01 GMT+0530 (IST)

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ - శంకర్ ల కాంబినేషన్ లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ చిత్రంకు ఇప్పుడు సీక్వెల్ పనులు మొదలైన విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం 2.0 చిత్రం విడుదల పనుల్లో ఉన్న శంకర్ ఆ చిత్రం విడుదలైన తర్వాత అంటే డిసెంబర్ లో కమల్ హీరోగా భారతీయుడు 2 చిత్రంను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక తన ప్రతి సినిమాలో కూడా చాలా విభిన్నమైన మేకప్ తో కనిపించే కమల్ అప్పట్లో భారతీయుడు సినిమాలో ఒక పాత్ర కోసం చాలా కష్టమైన మేకప్ తో నటించిన విషయం తెల్సిందే.ఆ తర్వాత కూడా ఎన్నో చిత్రాల్లో కష్టతరమైన మేకప్స్ తో ఎంతో కష్టతరమైన పాత్రల్లో నటించిన కమల్ హాసన్ ఇప్పుడు ‘ఇండియన్ 2’ చిత్రం కోసం బరువు తగ్గి చాలా స్లిమ్ గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 15 కేజీల బరువును తగ్గేందుకు కమల్ ప్రయత్నిస్తున్నాడు. ఆమద్య చిన్న ప్రమాదం కారణంగా బెడ్ రెస్ట్ తీసుకున్న కమల్ బరువు పెరిగాడు. ఆ తర్వాత రాజకీయాలు ఇతరత్ర విషయాలు అంటూ వర్కౌట్స్ చేసే సమయం లేకుండా పోయింది. దాంతో బరువు మోతాదుకు మించి పెరిగి పోయాడు. అందుకే ఇప్పుడు బరువు పెరిగేందుకు కమల్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఒక ప్రముఖ ట్రైనర్ సమక్షంలో రోజులో అయిదు గంటలు కష్టపడి కమల్ హాసన్ బరువు తగ్గేందుకు వర్కౌట్ లు ప్రారంభించాడట. డిసెంబర్ వరకు కమల్ 15 కేజీల బరువు తగ్గడమే లక్ష్యంగా వర్కౌట్స్ చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఏ సినిమా చేసినా ఆ చిత్రంలోని పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించే కమల్ హాసన్ ఈ చిత్రం విషయంలో కూడా అదే విధంగా కష్టపడి బరువు తగ్గడంతో పాటు షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కూడా అంతే కష్టపడాలని భావిస్తున్నాడు.

కమల్ శంకర్ ల ‘భారతీయుడు 2’ చిత్రం కేవలం  తమిళం - తెలుగులోనే కాకుండా హిందీతో పాటు ఇంకా పలు భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. భారీ చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్ తాజాగా హెలికాప్టర్ లో వెళ్లి సినిమాకు సంబంధించిన లొకేషన్స్‌ను అన్వేషించడం జరిగింది. మొదటి పార్ట్ మాదిరిగానే ఈ పార్ట్ లో కూడా హీరో అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తాడని అంతా భావిస్తున్నారు.