Begin typing your search above and press return to search.

ఎమ్జీఆర్ ఉంటే వచ్చేవాడినంటున్న కమల్

By:  Tupaki Desk   |   24 Jan 2017 10:46 AM GMT
ఎమ్జీఆర్ ఉంటే వచ్చేవాడినంటున్న కమల్
X
ప్రస్తుతం తమిళనాట ఉద్ధృతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమంపై సెలబ్రెటీల్లో అందరి కంటే ముందు స్పందించింది కమల్ హాసనే. జల్లికట్టును నిషేధించాలన్న సుప్రీం కోర్టు తీర్పు వెలువడగానే ఆయన ఘాటుగా స్పందించారు. ఇది తమిళుల సంస్కృతిపై దాడి అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రజలు పోరాడాలన్నారు. ఆ తర్వాత ఉద్యమం పెద్ద స్థాయికి వెళ్లింది. సెలబ్రెటీలు చాలామంది ఆందోళనకారులకు జత కలిశారు. ఐతే కమల్ మాత్రం క్షేత్ర స్థాయికి రాలేదు. సోషల్ మీడియాలో మాత్రమే తన వాయిస్ వినిపిస్తున్నారు. తాను ఎందుకు గ్రౌండ్ లెవెల్లోకి రానిది కమల్ వివరించారు.

‘‘ఇప్పుడు ఎమ్జీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నేను మెరీనా బీచ్ లో అడుగుపెట్టేవాడిని. ఆయన జనాదరణ ఉన్న నాయకుడు’’ అని కమల్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జనాదరణ లేదని చెప్పకనే చెప్పాడు కమల్. తన లాంటి సెలబ్రెటీలు ఈ ఆందోళన కార్యక్రమాల వద్దకు వెళ్తే ఫోకస్ తమ మీదికి వెళ్తుందని.. ఐతే ఇలాంటి ప్రజా ఉద్యమాల్లో క్రెడిట్ మొత్తం వారికే దక్కాలని.. అందరి దృష్టీ వారి మీదే ఉండాలని కమల్ వ్యాఖ్యానించాడు. ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారడంలో పోలీసుల పాత్ర ఉందని.. ఇందులో కుట్ర కోణం కనిపిస్తోందని కమల్ అన్నాడు. ఆటోవాలాలపై పోలీసుల దాడులపై స్పందిస్తూ.. ‘‘అక్కడ ఏం జరుగుతోందో ఫొటోలు.. వీడియోల్లో చూస్తున్నాం. దీనికంతటికి పోలీసులు వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఆ వీడియోలు వైరల్ కాకూడదని కోరుకుంటున్నా’’ అని కమల్ అన్నాడు. జల్లికట్టు ఉద్యమానికి నాయకుడు లేడంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారని.. ఐతే నాయకుడు లేకున్నా ఎంత సమష్టిగా జనాలు కదులుతున్నారో చూడాలని కమల్ అన్నాడు. జల్లికట్టు మాత్రమే కాక దేనిమీదైనా నిషేధం విధించడాన్ని తాను వ్యతిరేకిస్తానని.. తన సినిమాల్లో కూడా అదే చూపిస్తానని కమల్ స్పష్టం చేశాడు.