కమల్ మీద 'ఎస్సీ..ఎస్టీ' కేసు పెట్టాలన్న మంత్రి

Mon Jul 17 2017 15:25:49 GMT+0530 (IST)

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది బిగ్ బాస్ కార్యక్రమం. ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహిస్తున్న ఈ షో పుణ్యమా అని పుట్టెడు వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. తమిళ బిగ్ బాస్‌కు ప్రయోక్తగా వ్యవహరిస్తున్న  ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై సంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వైనం తెలిసిందే.

ఈ కార్యక్రమం తమిళ సంస్కృతి.. సంప్రదాయాల్ని కించపరిచేలా ఉందని.. అందుకే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని.. కమల్ హాసన్‌ను అరెస్ట్ చేయాలంటూ హిందూ మక్కళ్ కట్చి నిర్వాహకులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిందూ మక్కళ్ కట్చి విమర్శలపై సమాధానం చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టిన కమల్.. అసలు విషయాన్ని వదిలేసి.. పళనిస్వామి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న అవినీతి గురించి ప్రస్తావించటం మరో కలకలానికి తెర తీసింది.

దీంతో అసలు విషయం పక్కకు వెళ్లిపోయి.. కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఏదో షో చేసుకుంటే చేసుకోవాలే కానీ.. ఆ పేరు చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? అంటూ అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీవీ కార్యక్రమానికి పేరు తెచ్చుకోవటం కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని కమల్ మీద ధ్వజమెత్తుతున్నారు. వ్యవస్థ బాగోలేదని చెప్పటం ద్వారా.. భారత రాజ్యాంగమే సక్రమంగా లేదని చెబుతున్నారా? అంటూ తమిళనాడు ఆర్థికమంత్రి జయకుమార్ ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి ఉందని కమల్ నిరూపిస్తారా? అంటూ సవాలు విసురుతున్నారు. ఇదిలా ఉంటే.. కమల్ మనిషే కాదని.. ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదని న్యాయ మంత్రి సీవీ షణ్ముఖం ఫైర్ అయ్యారు. డబ్బు కోసం ఏదైనా చేసే కమల్ బడుగు..బలహీన వర్గాల వారిని కించపరిచేలా మాట్లాడారని.. అందుకే ఆయన మీద ఎస్సీఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. మొత్తానికి బిగ్ బాస్ షో కాస్తా బిగ్ కాంట్రావర్సీగా మారుతున్నట్లుగా కనిపించక మానదు. మరి..వీటిల్లో నుంచి కమల్ ఎలా బయటకు వస్తారో చూడాలి.