విశ్వనటుడు సంచలన నిర్ణయం

Fri Aug 10 2018 09:40:24 GMT+0530 (IST)

మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ ఎం) పార్టీ ప్రారంభించిన కమల్ హాసన్.. పార్టీ పెట్టింది మొదలు పబ్లిక్ లో జోష్ పెంచుతూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. తన బలం పెంచుకునేందుకు అన్నిరకాలా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీల తీరుతెన్నుల్ని ఎండగడుతూ తమిళ రాజకీయాల్లోకి కొత్త నీరు రావాల్సిందేనని పంతంతో ముందుకు కదులుతున్నారు. ఆ క్రమంలోనే కేంద్ర స్థాయిలో కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే కమల్ హాసన్ సినిమాలు చేస్తూ రాజకీయాలు నడిపిస్తారా?  లేక సినిమాలు వదిలేస్తారా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.ఇటీవలే హైదరాబాద్ విచ్చేసినప్పుడు రాజకీయాలకు పూర్తి న్యాయం చేస్తానని - అందుకే చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే రాజకీయాలకు న్యాయం చేయాలంటే పూర్తిగా అటే కాన్సన్ ట్రేట్ చేయాల్సి ఉంటుందని క్లియర్ కట్ గా చెప్పారు. ఇదే మాటను పలు వేదికలపై కమల్ ఉద్ఘాటించారు. ఇప్పుడు మరోసారి క్లియర్ కట్ గా తన నిర్ణయం ప్రకటించారు కమల్. తాను రాజకీయాల్లో దూసుకెళ్లాలంటే సినిమాలు వదిలేయాల్సిందేనని నిర్ణయించుకున్నానని కమల్ వ్యాఖ్యానించారు. సీనియర్ నటుడు ఎంజీఆర్ తరహాలో రాజకీయ నాయకుడిగా - హీరోగా నేను ద్విపాత్రాభినయం చేయలేనని అన్నారు.

ఎంజీఆర్ అప్పట్లో నటుడిగా కొనసాగుతూనే ఎమ్మెల్యేగానూ రాణించారు. రాజకీయాల్ని నడిపించారు. అయితే ఎంజీర్ రిటైర్మెంట్ కి చాలా ముందే రాజకీయాల్లోకి రావడం వల్ల అది చేయగలిగారు. కానీ నేను అలా కాదు. చివరి వయసులో రాజకీయారంగేట్రం చేస్తున్నాను. అందువల్ల డ్యూయల్ రోల్ పోషించలేను. ఇక్కడ ఎన్నో బాధ్యతలు - లక్ష్యాలు ఉన్నాయి. వాటిని చేరువ కావాలంటే పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలి. అందుకే సినిమాలు వదిలేస్తున్నానని కమల్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం కమల్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ కమల్ హాసన్ సినిమాలు వదిలేస్తే తదుపరి అతడు నటించబోయే `భారతీయుడు 2` పరిస్థితేంటి? ఒకవేళ శంకర్ ఈ సినిమా కథ రాస్తున్నది కమల్ కోసం కాదా?  శంకర్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ని కలవడం వెనక ఇంకేదైనా కారణం ఉందా?  అజయ్ నే లీడ్ పాత్రలోకి తీసుకుంటున్నాడా? ఇలా పలు సందేహాలు నెలకొన్నాయిప్పుడు. దీనిపై కమల్ ఫ్యాన్స్ లో ఆరాలు మొదలయ్యాయి.