భారతీయుడు ఆగిపోలేదట

Wed Feb 20 2019 10:15:21 GMT+0530 (IST)

గత రెండు రోజులుగా సౌత్ ని కుదిపేస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ అప్ డేట్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. బడ్జెట్ విషయంలో లైకా సంస్థకు దర్శకుడు శంకర్ కు అండర్ స్టాండింగ్ రానందున ఇది ఆగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందంటూ చాలా బలంగానే వినిపించింది. దానికి తగ్గటు ప్రముఖ మీడియా ఛానల్స్  లో కూడా దీనికి సంబంధించిన వార్తలు రావడంతో కమల్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడ్డారు. అయితే ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం ఇండియన్ 2 ఆగిపోలేదట.అధికారికంగా ధ్రువీకరించకపోయినా లైకా నుంచి అందిన సమాచారం మేరకు దీని షూటింగ్ కొనసాగుతూనే ఉందట. చెన్నైలోనే జిహేచ్ లోని ఓ మెమోరియల్ హాల్ లో వారం రోజులు షూటింగ్ చేసిన యూనిట్ మరో షెడ్యూల్ గోకులం స్టూడియోస్ లో పూర్తి చేసారు. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు. అప్పుడు రేగిన పుకార్ల వల్లే ఈ ప్రచారం అంతా జరిగింది. ఇది కాస్తా కోలీవుడ్ లో విపరీతంగా ప్రచారం జరగడంతో గాసిప్స్ కి రెక్కలు వచ్చేసాయి.

కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఇండియన్ 2 లో సిద్దార్థ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. విలన్ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అక్షయ్ కుమార్ పేరే గట్టిగా వినిపిస్తోంది. నిజానికి భారతీయుడు ఫస్ట్ పార్ట్ లో విలనే ఉండడు. ప్రతికూలమైన పరిస్థితులే అందులో హీరో పాత్రకు సవాళ్ళు విసురుతాయి. లంచమే శత్రువుగా చూపడంతో ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. కాని ఇండియన్ 2లో ఆ అవకాశం లేదు. అందుకే వేట సాగుతోందట. అనిరుద్ రవి చందర్ ట్యూన్ కంపోజింగ్ కూడా స్టార్ట్ అయ్యిందని వినికిడి. ఏదైతేనేం కమల్ ఫ్యాన్స్ ఈ వార్త హ్యాపీగా ఉన్నారు.