విశ్వరూపం-2 కదిలింది

Thu Apr 20 2017 19:38:56 GMT+0530 (IST)

నాలుగేళ్ల కిందట వచ్చిన కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం’ ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయింది. కమల్ స్వీయ దర్శకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగే కలిగింది భారతీయ ప్రేక్షకులకు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని చివర్లో కమల్ ఇచ్చిన హింట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. విశ్వరూపం-2 ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ సినిమా పూర్తయినా విడుదలకు మాత్రం నోచుకోలేదు. మూడేళ్ల నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురు చూస్తోంది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడమే దీనికి కారణం.

ఐతే తన సినిమాను బయటికి తేవడానికి ఏడాది నుంచి గట్టి ప్రయత్నమే చేస్తున్న కమల్.. ఎట్టకేలకు ఆ దిశగా ముందడుగు వేశాడు. కమల్ సొంత నిర్మాణ సంస్థ ‘విశ్వరూపం-2’ను తన చేతికి తీసుకుంది. ప్రస్తుతం చెన్నైలో విశ్వరూపం-2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వీఎఫెక్స్.. డిజిటల్ ఇంటర్మీడియట్ పనులు చకచకా కానిస్తున్నారు. గత ఏడాది కాలు విరిగాక ‘శభాష్ నాయుడు’ సినిమాను పక్కన పెట్టేసిన కమల్.. ఇప్పుడు ఆ సినిమాను పున:ప్రారంభించకుండా ‘విశ్వరూపం-2’ మీదే దృష్టిపెట్టాడు. కొన్ని నెలల్లోనే ఈ పనులు పూర్తవుతాయని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘విశ్వరూపం-2’ విడుదలవుతుందని అంటున్నారు. ఇది కమల్ అభిమానులకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చే విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/