Begin typing your search above and press return to search.

ఆ సినిమా సినిమా హిట్ట‌యితే ప‌నివాడిగా చేర‌తా

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:42 PM GMT
ఆ సినిమా సినిమా హిట్ట‌యితే ప‌నివాడిగా చేర‌తా
X
సోష‌ల్ మీడియాలో బాలీవుడ్ సినిమాల్ని ఫాలో అయ్యేవారికి క‌మ‌ల్.ఆర్‌.ఖాన్ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. కొన్ని చెత్త సినిమాల్లో న‌టించ‌డంతో పాటు.. ప్ర‌తి హిందీ సినిమాకూ రివ్యూలు ఇస్తూ ఇష్టానుసారం కామెంట్లు చేస్తుంటాడు ఈ క‌మ‌ల్. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెంచుకుని పాపుల‌ర్ అయిన క‌మ‌ల్ గురించి కొన్ని రోజుల కింద‌ట సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న సినిమా ‘శివాయ్’ గురించి వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డానికి క‌ర‌ణ్ జోహార్ అత‌డికి పాతిక ల‌క్ష‌లు ఇచ్చాడ‌న్నాడు. ఈ ఆరోప‌ణ‌లు బాలీవుడ్లో పెద్ద దుమార‌మే రేపాయి. కొన్నాళ్ల త‌ర్వాత ఆ గొడ‌వ ఎలాగోలా స‌ద్దుమ‌ణిగింది.

ఐతే ఇప్పుడు క‌మ‌ల్ ఆర్‌.ఖాన్ శివాయ్ సినిమా గురించి చేస్తున్న కామెంట్లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. శివాయ్ సినిమా ప్రివ్యూ చూశానని.. అది చెత్త‌గా ఉంద‌ని చెబుతూ ట్వీట్లు గుప్పించాడు క‌మ‌ల్. ‘‘శివాయ్‌ సినిమా చూశాను. పరమ చెత్తగా ఉంది. ఈ సినిమా చూడటం వ‌ల్ల సమయం వృధా.. డబ్బు వృధా. శివాయ్‌ బల్గేరియాలో జరిగే వ్యభిచారం గురించి తీసిన సినిమా. ఈ విషయం గురించి భారతీయులు సినిమా చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చివ‌రి అరగంటలో అజయ్‌ పర్వతాలు ఎక్కడం మాత్ర‌మే చూపించారు. కేవలం పర్వతాలు చూపించడానికే సినిమా తీశారేమో. ఒక సీన్లో ప్రతీ భారతీయుడూ అవినీతిపరుడే అన్నట్లు చూపించారు. అజయ్ అభిమానుల‌కు స‌వాలు విసురుతున్నా.. ‘శివాయ్‌’ సినిమా సోమవారం వరకు బాక్సాఫీస్‌ వద్ద నిలవదు. ఒకవేళ బాగా ఆడితే నేను అజయ్‌ ఆఫీస్ లో పనివాడిగా చేరతాను’’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు క‌మ‌ల్‌. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై అజ‌య్ ఎలా స్పందిస్తాడో.. అస‌లు శివాయ్ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/