గ్లామరైనా సైయంటున్న హలో భామ

Wed Jun 13 2018 15:17:57 GMT+0530 (IST)

అఖిల్ రెండో సినిమా హలోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ మొదటి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అవకాశాలు కూడా వెల్లువెత్తడం లేదు. మొదటి  సినిమాలో చాలా హోమ్లీ గా ఉండాల్సిన అమ్మాయి పాత్ర కావడంతో పాటు గ్లామర్ పరంగా ఏదైనా చూపించే ఛాన్స్ ఆ సినిమా ఇవ్వలేదు. అందుకే తనకు ఆఫర్స్ రావడం లేదని గుర్తించినట్టు ఉంది కాబోలు అవసరమైన మేరకు స్కిన్ షోకు రెడీ అంటోంది హలో భామ. ఈ విషయంలో తనకు శృతి హాసన్ స్ఫూర్తి అని చెబుతోంది. తనకు కూడా మొదటి సినిమా డిజాస్టర్. హిందీలో సంజయ్ దత్ లాంటి స్టార్ హీరో సరసన చేసిన లక్ సూపర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత కొంత కాలం వేచి చూసాక గబ్బర్ సింగ్ రూపంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా బ్లాక్ బస్టర్ అందుకుంది. మరీ ఓవర్ గా కాదు కానీ శృతి హాసన్ అందాల విషయంలో ఎక్కువ మొహమాటం పడలేదు.అందుకే తాను కూడా అదే రూట్ లో వెళ్తూ అవకాశాలు పట్టేస్తాను అంటోంది. కళ్యాణి ప్రియదర్శన్ చూడ్డానికి మరీ చిన్న పిల్లలా కనిపిస్తుంది కానీ తనకు వివిధ శాఖల మీద అవగాహనా ఉంది. క్రిష్ 3 సినిమాకు అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన కళ్యాణి ఆ తర్వాత విక్రమ్ ఇంకొక్కడు మూవీకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. హీరోయిన్ గా చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం గత ఏడాదే. తనతో పాటు చల్ మోహనరంగా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అమ్మ లిజితో పాటు హైదరాబాద్ కు వస్తూ పోతూ  ఇక్కడే గట్టి ప్రయత్నాలు చేసే పనిలో ఉంది. నాన్న ప్రియదర్శన్ గొప్ప దర్శకుడు అయినప్పటికీ తనకు తాను రుజువు చేసుకున్నాకే ఆయన సినిమాలో నటిస్తుందట. మొత్తానికి గట్టిపిండమే.